ఎల్‌టిటిఇ సానుభూతిపరుడు, ద్రవిడ ఉద్యమవాది, ‘మే 17మూవ్మెంట్’ అనే వేర్పాటువాద సంస్థ నాయకుడు అయిన తిరుమురుగన్ గాంధీ మీద తమిళనాడు బీజేపీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతసైన్యంలో మేజర్‌గా పనిచేసి అమరుడైన అశోకచక్ర ముకుంద్ వరదరాజన్ నిజానికి ‘యుద్ధ నేరస్తుడు’ అంటూ తిరుమురుగన్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు, కశ్మీరీ ఉగ్రవాదులను స్వతంత్ర సమరయోధులుగా అభివర్ణించాడు. అతని వ్యాఖ్యల మీద మండిపడిన తమిళనాడు బీజేపీ, గ్రేటర్ చెన్నయ్ పోలీస్ కమిషనర్‌కు అతనిమీద ఫిర్యాదు చేసింది.
తిరుమురుగన్ వ్యాఖ్యల వివాదం ‘అమరన్’ సినిమా నేపథ్యంలో మొదలైంది. భారత సైన్యంలో మేజర్‌గా పనిచేసిన,
తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ జీవితచరిత్ర ఆధారంగా ఆ సినిమా రూపొందించారు. ఆ చిత్రానికి ప్రజాదరణతో పాటు విమర్శకుల, ప్రముఖుల ఆదరణ కూడా లభించింది. కమల్‌హాసన్ ఒక నిర్మాతగా వ్యవహరించిన ఆ సినిమాపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సూపర్‌స్టార్ రజినీకాంత్ వంటివారు ప్రశంసల జల్లు కురిపించారు.అయితే, కొన్ని వర్గాలు మాత్రం అమరన్ సినిమాను దుమ్మెత్తిపోసాయి. ఆ సినిమాలో కశ్మీర్ సమస్యను, భారత సైన్యాన్ని చూపించిన తీరును ‘మే 17మూవ్మెంట్’ సంస్థ సహా ముస్లిం సంస్థలు, ద్రవిడ పార్టీలు తప్పుపట్టాయి.
‘మే 17మూవ్మెంట్’ వ్యవస్థాపకుడు తిరుమురుగన్ గాంధీ నవంబర్ 8న పాత్రికేయుల సమావేశం పెట్టి మరీ అమరన్ సినిమాపై తీవ్రవిమర్శలు చేసాడు. ఆ సినిమాలో కశ్మీరీ ప్రజలను తప్పుగా చూపించారని ఆరోపించాడు. తమ భూమిపై తమ హక్కుల కోసం పోరాడుతున్న కశ్మీరీలను ఉగ్రవాదులుగా చూపించడం ద్వారా చరిత్రను వక్రీకరించారని మండిపడ్డాడు. నిజానికి వారు స్వతంత్ర సమర యోధులనీ, వారిపై పోరాడిన భారత సైన్యమే నేరస్తురాలనీ వ్యాఖ్యానించాడు. కశ్మీర్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్‌లో పాల్గొన్నందుకుగాను, మేజర్ ముకుంద్ వరదరాజన్‌ను యుద్ధనేరస్తుడు అంటూ తప్పుపట్టాడు.
అంతేకాదు, ఆ సినిమాలో భారత సైనికులు ‘జై బజరంగ్‌బలీ’ అంటూ నినాదాలు ఇవ్వడాన్ని తిరుమురుగన్ విమర్శించాడు. సైన్యం ఒక మతపరమైన నినాదం చేసినట్లు చూపించడం తప్పుడు చిత్రీకరణ అని వ్యాఖ్యానించాడు. నిజానికి భారత సైన్యంలోని రాష్ట్రీయ రైఫిల్స్, రాజ్‌పుత్ రెజిమెంట్ వంటి విభాగాల అధికారిక యుద్ధ నినాదం ‘జై బజరంగ్‌బలీ’ అన్న నిజాన్ని తిరుమురుగన్ ఉద్దేశపూర్వకంగా విస్మరించాడు. ఆ సినిమాపై కొత్త వివాదాన్ని రేకెత్తించే దురుద్దేశంతోనే అతనా పని చేసాడు.
బీజేపీ తమిళనాడు నాయకులు ఎ అశ్వత్థామన్, వనతి శ్రీనివాసన్, ఎఎన్ఎస్ ప్రసాద్, ఎచ్ రాజా తదితరులు తిరుమురుగన్ గాంధీ వ్యాఖ్యల మీద తీవ్రంగా మండిపడ్డారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన అమరవీరుడి ప్రతిష్ఠ మీద బురద జల్లుతున్నాడని ఆరోపించారు. ‘తిరుమురుగన్ వ్యాఖ్యలు మేజర్ ముకుంద్ వరదరాజన్‌ను అవమానించడం మాత్రమే కాదు, మన దేశ సైన్యపు చిత్తశుద్ధి మీద ప్రత్యక్షంగా దాడి చేయడమే. అతని ప్రకటనలు సైన్యానికి వ్యతిరేకంగా దేశప్రజలను ప్రేరేపించడం మాత్రమే కాదు, జాతీయ భద్రతకు ప్రమాదకరం కూడా’ అని అశ్వత్థామన్ వ్యాఖ్యానించారు. తిరుమురుగన్ మీద దేశద్రోహం, జనాలను రెచ్చగొట్టడం ఆరోపణలతో ఫిర్యాదు చేసారు. అయితే, గతంలోనూ తిరుమురుగన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, అతని నేరాలను చూసీచూడనట్లు వదిలేసారనీ డీఎంకే ప్రభుత్వవైఖరి మీద అశ్వత్థామ అసంతృప్తి వ్యక్తం చేసారు.