మథురలో కృష్ణజన్మభూమి ఆలయం కోసం కోర్టులో పోరాడుతున్న ఆశుతోష్ పాండేకు పాకిస్తాన్ నుంచి బెదింపులు వచ్చాయి. ఆ కేసును విచారిస్తున్న అలహాబాద్ హైకోర్టును పేల్చేస్తామంటూ ఏకంగా 22 ఆడియో సందేశాలు నవంబర్ 13న ఆశుతోష్ పాండేకు అందాయి.
ఆశుతోష్ పాండే మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్టు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు నవంబర్ 13 రాత్రి వాట్సాప్ సందేశాలు వచ్చాయి. అవి పాకిస్తాన్‌కు చెందిన రెండు ఫోన్ నెంబర్ల నుంచి వచ్చాయి. ఆ సందేశాల్లో అలహాబాద్ హైకోర్టును పేల్చేస్తామన్న బెదిరింపులు ఉన్నాయి. ఇంక ఆశుతోష్ పాండేను వ్యక్తిగతంగా బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరించారు కూడా.
వాట్సాప్ మెసేజ్‌లు పంపించిన వారు నవంబర్ 19న అలహాబాద్ హైకోర్టును పేల్చేస్తామని, ఆ మరునాడు, అంటే నవంబర్ 20న పాండేను చంపేస్తామనీ బెదిరించారు. ఆ తర్వాత అవే నెంబర్ల నుంచి ఆయనకు ఫోన్‌కాల్స్ కూడా వచ్చాయి. ఆ కాల్స్‌లో కూడా వారు ఆయనను చంపేస్తామని బెదిరించారు.
ఆశుతోష్ పాండేకు మొత్తం 22 వాట్సాప్ ఆడియో మెసేజ్‌లు వచ్చాయి. ఒక్కొక్కటీ 3 నుంచి 12 సెకండ్ల వ్యవధిలో ఉన్నాయి. తనకు గతంలో కూడా అదే తరహా బెదిరింపులు వచ్చినట్లు పాండే గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ బెదిరింపుల గురించి ఆయన ప్రయాగ్‌రాజ్, కౌశాంబి, ఫతేపూర్, మథుర పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. ఇప్పుడు ఆయన శామ్లీ లోని కాండ్లా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అందువల్ల తాజాగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాట్సాప్ సందేశాలను శామ్లీ పోలీసులకు దర్యాప్తు కోసం అందజేసారు.
మథురలోని శ్రీకృష్ణజన్మభూమి ఆలయాన్ని షాహీ ఈద్గా మసీదు నియంత్రణ నుంచి విడిపించాలని కోరుతూ పిటిషన్లు వేసిన 18మందిలో ఆశుతోష్ పాండే ఒకరు. అంతేకాదు, షాహీ ఈద్గా మసీదులో అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. దానికి కారణమైన మసీదు కమిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆశుతోష్ పాండే ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేసారు.