అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్లో చేరనున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. త్వరలో అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోత పెట్టే అవకాశముందనే సంకేతాలు ఇచ్చారు. దీంతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం రాబోతోందనే సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లక్షల మంది ఫెడరల్ బ్యూర్యోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి తొలగించేందుకు తాను, మస్క్ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వివేక్ రామస్వామి వ్యాఖ్యానించారు. లక్షల మంది ఉద్యోగాల్లో కోత వేసి ఈ దేశాన్ని కాపాడాలనుకుంటున్నామని రామస్వామి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి.
గడచిన నాలుగేళ్లలో అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితి కొనసాగుకూడదు. జాతితో సంబంధం లేకుండా నైపుణ్యం ఉన్న వారికే ఉద్యోగాలు కల్పిస్తాం. దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి. మస్క్ చేతిలో ఉలి కాదు, రంపం ఉందంటూ రామస్వామి హెచ్చరించారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆయన గెలుపునకు సహకరించిన వారిని కీలక పదవుల్లో నియమించారు. ప్రపంచ కుబేరుడు మస్క్, భారత సంతతి నాయకుడు వివేక్ రామస్వామికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ ( డోజ్) సారథులుగా నియమించారు. ప్రభుత్వ శాఖల్లో వీరు కీలక సంస్కరణలు తీసుకురానున్నారు. ఇందుకు అవసరమైన మానవవనరులను కూడా తీసుకోవడం ప్రారంభించారు. తమ కోసం వారానికి కనీసం 80 గంటలు పనిచేయగలిగే నైపుణ్యం కలిగిన వారు కావాలంటూ ఎక్స్ వేదికగా ఇచ్చిన ప్రకటన వైరల్గా మారింది.
ట్రంప్ కూడా నియామకాల జోరు పెంచారు. వైట్ హౌస్ మీడియా విభాగం అధిపతిగా 27 ఏళ్ల కరోలిన్ లేవిట్ను నియమించుకున్నారు. జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోగానే లేవిట్ నియామకం అమల్లోకి రానుంది. ఈ బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయస్కురాలు లేవిట్ కావడం విశేషం. ట్రంప్ ఎన్నికల ప్రచారంలోన కరోలిన్ కీలక బాధ్యతలు నిర్వహించారు.