ఉగ్రవాదానికి కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎకనామిక్ టైమ్స్ ఢిల్లీలో నిర్వహించిన లీడర్షిప్ సదస్సులో కీలక ప్రసంగం చేశారు.ఉగ్రవాదాన్ని అణచివేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని గుర్తుచేశారు. ముంబైపై ఉగ్రదాడులను ఆయన ప్రస్తావించారు. 2014లో ప్రజలు తమకు అధికారం ఇచ్చాక ఉగ్రవాదులు వారి గడ్డపైనే ప్రాణభయంతో బతుకుతున్నారని గుర్తుచేశారు.ఉగ్రవాదులు ఇక భారత్న భయపెట్టలేరని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజలు ప్రభుత్వాలను మార్చారని, కానీ తమకు మూడోసారి అవకాశం కల్పించారని ప్రధాని మోదీ చెప్పారు. విపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాయన్నారు. అలాంటి విధానాలను పోగొట్టామన్నారు. ప్రజల కోసం ఎక్కువ ఖర్చు, ప్రజల కోసం ఎక్కువ పొదుపు అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని ప్రధాని మోదీ చెప్పారు.ప్రజల కోసం, ప్రజల చేత అనే మంత్రంతో ముందుకు సాగుతున్నట్లు మోదీ తెలిపారు.
గత ప్రభుత్వ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక అవినీతికి అడ్డుకట్ట వేశామన్నారు. మేడిన్ ఇండియాలో భాగంగా భారత్ ఆయుధాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.