వచ్చే ఏడాది జనవరి 15 న మకరజ్యోతి దర్శనం
కేరళలోని శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరిచారు. మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం ఆలయాన్ని తెరిచారు. శుక్రవారం సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు పీఎన్ మహేష్ నంబూద్రి, గర్భగుడి తలుపులు తెరిచారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ క్రతువుతో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది.
తొలుత ఆలయ ప్రధాన అర్చకుడు మహేష్ నంబూద్రి గర్భగుడి వద్ద సాష్ఠాంగ ప్రణామం చేశారు. అనంతరం కర్పూర హారతిని వెలిగించారు. సన్నిధానానికి ఇరువైపులా కర్పూరాన్ని వెలిగించి గంటానాదం చేశారు. తర్వాత గుడి తలుపులకు వేసిన తాళం తీసి కర్పూర హారతిని తీసుకుని లోనికి వెళ్లారు.
అర్చకులు, తిరువాంకూర్ దేవస్థానం బోర్డు సభ్యులు, అధికారులు సన్నిధానంలో ఉన్నారు. తలుపులు తెరిచే సయంలో అక్కడ ఉన్న వారంతా ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినదించారు. నేటి నుంచి ఉదయం 11 గంటలకు పంపా నదీతీరం నుంచి శబరిమలకు పయనం అవుతారు. డిసెంబర్ చివరి వారం వరకూ ఆలయ తలుపులు తెరిచే ఉంచుతారు. అనంతరం మూసివేసి మకరజ్యోతి దర్శనం కోసం జనవరి రెండో వారంలో తెరుస్తారు.
ఏడాది 20 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్పస్వామి దర్శనానికి వస్తారని కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది 15 లక్షల మంది మణికంఠుడిని దర్శించుకున్నారు.