పాట్నా విమానాశ్రయంలో గడ్డి కోసే ట్రాక్టర్ బురదలో చిక్కుకుపోవడంతో ఇండిగో విమానం 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.
ఇవాళ ఉదయం 10 గంటలకు కోల్కతా నుంచి పాట్నాకు ఇండిగో విమానం జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ సమయంలో రన్ వే పక్కనే ఓ ట్రాక్టర్ గడ్డి కోస్తూ బురదలో దిగబడిపోయింది. ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో విమానం 40 నిమిషాల సేపు ఆకాశంలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. సిబ్బంది అతి కష్టం మీద బురదలో కూరుకుపోయిన ట్రాక్టర్ను బయటకు లాగి దూరంగా తరలించారు. దీంతో ఇండిగో విమానం సురక్షితంగా దిగింది.
ఈ ఘటనపై విమాన ప్రయాణీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు విమానం సురక్షితంగా దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు విచారణ చేస్తున్నారు.