దక్షిణాఫ్రికా పర్యటనను భారత టీ20 జట్టు విజయవంతంగా ముగించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకుంది. అన్ని రంగాల్లో భారత జట్టు దక్షిణాఫ్రికా పై పైచేయి సాధించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా శుక్రవారం జరిగిన చివరి పోరులో భారత్ 135 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 283 పరుగులు చేసింది. తెలుగుకుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ , 47 బంతుల్లో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. 9 ఫోర్లు, 10 సిక్సులతో అదరగొట్టాడు. మరో వైపు , సంజూ శామ్సన్ 56 బంతుల్లో 109 పరుగులతో నాటౌట్ ఉన్నాడు. ఇద్దరూ పోటీపడి మరీ సెంచరీలు చేశారు.
ఈ సిరీస్ లో తెలుగు కుర్రాడు తిలక్ కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ల తర్వాత శామ్సన్‌కు ఈ సిరీస్‌లో రెండో శతకం చేశాడు. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 36 పరుగులు చేశాడు.
భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా పూర్తిగా విఫలమైంది. తొలి రెండు ఓవర్లలో హెన్డ్రిక్స్ (0), రికెల్టన్ (1) వెనుదిరగ్గా… మూడో ఓవర్లో అర్ష్ దీప్ దెబ్బకు మార్క్రమ్ (8), క్లాసెన్ (0)పెవిలియన్ చేరారు. స్టబ్స్, మిల్లర్ కొద్దిసేపు క్రీజులో నిలబడినా ఉపయోగం లేకుండా పోయింది. దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ కు భారీ విజయం దక్కింది.
భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ , వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్య , బిష్ణోయ్, రమణదీప్ సింగ్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.