కేరళలోని ఇడుక్కి వద్దనున్న ప్రముఖ పర్యాటక ప్రాంతం కుమిలీలో పర్యటిస్తున్న ఇజ్రాయెలీ పర్యాటకులకు అవమానం ఎదురైంది. కశ్మీర్ నుంచి వచ్చి కేరళలో వ్యాపారం చేసుకుంటున్న ఒక ముస్లిం దుకాణదారుడు ఇజ్రాయెలీ మహిళను అవమానించాడు. ఆ గొడవనుంచి, అతను క్షమాపణ చెప్పి తప్పించుకున్నాడు.
హయాస్ అహ్మద్ రాథర్ అనే ముస్లిం వ్యక్తి కశ్మీర్ నుంచి వచ్చి కేరళలోని కుమిలీలో స్థిరపడ్డాడు. అక్కడ అతను ఇంక్రెడిబుల్ ఇండియా పేరిట హస్తకళల దుకాణం నిర్వహిస్తున్నాదు. నవంబర్ 14 రాత్రి ఆ దారిలో కొందరు పర్యాటకులు వెడుతున్నారు. వారిని హయాస్ అహ్మద్ తన దుకాణంలోకి పిలిచాడు. వారు అతని దుకాణంలో వస్తువులు చూస్తున్నారు. డోవర్ వల్ఫర్ అనే మహిళ అక్కడి ఉత్పత్తులను చూస్తూ తన భర్తతో ఫోన్లో హిబ్రూ భాషలో మాట్లాడింది.
డోవర్ వల్ఫర్ సంభాషణను విన్న హయాస్ అహ్మద్ ఆమెను ఎక్కడినుంచి వచ్చిందని అడిగాడు. తను ఇజ్రాయెల్ నుంచి వచ్చానని చెప్పగానే అతని ప్రవర్తన మారిపోయింది. తన ఉత్పత్తులను ఇజ్రాయెలీలకు అమ్మబోనంటూ దుకాణంలో లైట్లన్నీ ఆర్పేసాడు. ఆ పర్యాటకులను తక్షణం బైటకు పొమ్మన్నాడు.
అవమానానికి గురైన వల్ఫర్ తన భర్తకు, తమ డ్రైవర్‌కు సమాచారం అందించింది. వారిద్దరూ కొద్దిసేపట్లో అక్కడకు చేరుకున్నారు. హయాస్ అహ్మద్‌తో గొడవ పడ్డారు. రచ్చ పెద్దదవడంతో స్థానిక ప్రజలు, మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిథులు అక్కడకు చేరుకున్నారు. చివరికి కశ్మీరీ ముస్లిం దుకాణదారు, ఇజ్రాయెలీ పర్యాటకులకు క్షమాపణలు చెప్పాడు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు కేసు పెట్టలేదు.
ఇటువంటి చర్యల వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువుకు నష్టం కలిగే అవకాశం ఉంది. కేరళలో పోలీస్ విభాగం చీఫ్‌గా పనిచేసి రిటైర్ అయిన టి.పి సేన్‌కుమార్ ఐపిఎస్ ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ నిందితుడు అసలు కశ్మీరీయుడు అవునో కాదో దర్యాప్తు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేరళలో దుకాణదారులుగా ఉంటున్న కశ్మీరీలకు ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్‌తో సంబంధాలు ఉన్నయేమో దర్యాప్తు చేయాలని సూచించారు.