మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం కోసం మిత్రపక్ష పార్టీ జనసేన అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రెండు రోజుల పాటు నాందేడ్, పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. ఆయన ఈరోజు ఉదయం నాందేడ్ చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్‌తో పాటు రాష్ట్ర మంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ కూడా ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
నాందేడ్ ప్రాంతంలో తెలుగు మూలాలున్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. దశాబ్దాల క్రితమే అక్కడ స్థిరపడి మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల్లో కలిసిపోయినా తెలుగు మూలాలను మాత్రం వారు మర్చిపోలేదు. అందుకే ఇప్పటికీ తెలుగువారిపై అభిమానం చూపుతున్నారు.
పవన్ కళ్యాణ్, సత్యకుమార్‌ల ప్రచారం వల్ల బీజేపీ విజయావకాశాలు మరింత మెరుగుపడి అభ్యర్థుల మెజార్టీలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, నాందేడ్‌లో ఆ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి తెలియజేసారు.
నాందేడ్ ప్రాంత అభివృద్ధి, స్థానిక ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ కూటమి చేసిన కృషి వల్ల అక్కడి ప్రజలు బీజేపీ కూటమిని ఆదరిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రధానమంత్రితో సహా పలువురు ముఖ్యనేతలు నాందేడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.