నేడు గురునానక్ 555వ జయంతి అయిన ప్రకాశ్ పర్వ్. ఈరోజే జాతీయ ప్రజాచైతన్యానికి ప్రతీక అయిన బిర్సా ముండా 149వ జయంతి కావడం యాదృచ్ఛికం. ఈ దినాన్ని ‘జనజాతీయ గౌరవ్ దివస్ – గిరిజనుల ఆత్మగౌరవ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం.
భగవాన్ బిర్సాముండాది అద్భుతమైన వ్యక్తిత్వం. 1875లో జన్మించిన బిర్సా కేవలం 25 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఆ చిన్న జీవితంలోనే అతను సాధించిన ఘనత సాటిలేనిది. అతని పేరు వింటే బ్రిటిష్ వారు వణికిపోయారు. అందుకే గిరిజనులు బిర్సాముండాను తమ దేవుడిగా భావించారు.
బిర్సాముండా తెలివితేటలు చూసి అతని తండ్రి అతన్ని రాంచీలోని ‘జర్మన్ మిషనరీ స్కూల్’లో చేర్పించాడు. ఆ పాఠశాలలో ప్రవేశం పొందాలంటే క్రైస్తవ మతంలోకి మారడం తప్పనిసరి. అందుకే బిర్సా క్రైస్తవుడిగా మారాల్సి వచ్చింది. అతనికి బిర్సా డేవిడ్ అని పేరు పెట్టారు.
స్కూల్లో చదువుకుంటున్న సమయంలోనే బిర్సా దేశంలో బ్రిటిష్‌వారి దౌర్జన్యాలను కూడా గమనించాడు. 1857 విప్లవ యుద్ధం దేశంలో అప్పుడే స్వతంత్ర కాంక్ష రగులుస్తోంది. బ్రిటిష్ వారి క్రూరమైన అణచివేత మొత్తం దేశంలో కొనసాగుతోంది. దాన్ని అర్ధం చేసుకున్న బిర్సాముండా తన చదువును మధ్యలోనే వదిలేశాడు. మళ్లీ హిందువుగా మారాడు. క్రైస్తవ మిషనరీల మోసపూరిత మతమార్పిడి వ్యూహాలకు వ్యతిరేకంగా అటవీ సోదరులను మేల్కొల్పడం ప్రారంభించాడు.
1894లో ఛోటా నాగపూర్ ప్రాంతంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికి బిర్సా ముండా వయస్సు కేవలం 19 సంవత్సరాలు. కానీ అతను తన అడవిలో నివసించే సోదరులకు అత్యంత అంకితభావంతో సేవ చేశాడు. అప్పుడే అతను బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయడం ప్రారంభించాడు.
బిర్సాముండా బ్రిటిష్ వారి మతమార్పిడి దుర్మార్గాలను గ్రహించాడు. దాన్ని అడ్డుకోడానికి గిరిజనులను హిందువులుగానే ఉంచడానికి అతను ఉద్యమం చేపట్టాడు. దానికి కొన్నాళ్ళ ముందే 1882లో బ్రిటిష్‌వారు ఒక చట్టం చేసారు. దాని ప్రకారం ఝార్ఖండ్ ప్రాంత గిరిజనుల భూమిని, అడవిలో నివసించే వారి హక్కును లాగేసుకోవడం మొదలుపెట్టారు.
దాన్ని వ్యతిరేకిస్తూ బిర్సా ముండా ‘అబువా దిశుమ్ – అబువా రాజ్’ (మన దేశం – మన పాలన) అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు. అది బ్రిటిష్ వారిపై బహిరంగ పోరాటం. ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోతూనే ఉన్నారు. 1897-1900 మధ్య కాలంలో రాంచీ, దాని చుట్టుపక్కల వనాంచల్ ప్రాంతాల్లో బ్రిటిష్ వారి పాలన పడిపోయింది. ఏ రకంగా చూసుకున్నా అదొక అద్భుతమైన చారిత్రక సంఘటన. 1757లో ప్లాసీ యుద్ధం నుంచీ భారతదేశంలో బ్రిటిష్ వారు అజేయులుగా ఉన్నారు, వారిని ఎవరూ ఓడించలేదు. వారిని ఎదిరించే ధైర్యం కూడా ఎవరూ చేయలేదు. కానీ ‘ధర్తీ ఆబా – నేలతల్లి కొడుకు’ బిర్సా నాయకత్వంలో అమాయక గిరిజన సంఘం బ్రిటిష్ పరిపాలనకు గండి కొట్టింది. తెల్లవారి సార్వభౌమాధికారాన్ని నేరుగా సవాల్ చేసి సుమారు 3 సంవత్సరాలు రాంచీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుండి బ్రిటిష్ పరిపాలనను నిర్మూలించారు. అక్కడ గిరిజనుల పరిపాలన ఏర్పాటైంది.
తమకు ఓటమిని రుచిచూపించిన బిర్సాముండాను ఎలాగైనా హతమార్చాలని బ్రిటిష్ వారు అన్నిరకాల కుట్రలూ పన్నారు. అతన్ని పట్టిచ్చిన వారికి రూ.500 నజరానా ప్రకటించారు. దానికి ఆశపడిన ఒక గిరిజనుడే, బిర్సాకు నమ్మకద్రోహం చెప్పాడు. బిర్సా ఆచూకీని బ్రిటిష్‌వారికి ఇచ్చాడు. 1900 జనవరిలో, రాంచీ జిల్లాలోని ఉలీహాతు సమీపంలోని డోమ్బాడీ కొండ మీద బిర్సాముండా గిరిజనులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు, బ్రిటిష్ సైన్యం అతన్ని చుట్టుముట్టింది. బిర్సాముండా సహచరులకు, బ్రిటిష్‌వారికీ భయంకరమైన పోరాటం జరిగింది. ఆ యుద్ధంలో చాలామంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఎట్టకేలకు 1900 ఫిబ్రవరి 3న బ్రిటిష్ వారు బిర్సా ముండాను చక్రధర్‌పూర్‌లో అరెస్టు చేసారు.
బిర్సాను జైలులో ఖైదు చేసిన బ్రిటీష్ వారు అక్కడే అతనిపై విషప్రయోగం చేసారు. ఫలితంగా 1900 జూన్ 9న గిరిజనుల ప్రియ నాయకుడు, నేలతల్లి బిడ్డ బిర్సా ముండా రాంచీ జైలులో తుదిశ్వాస విడిచాడు.
భారతీయ గిరిజనుల హిందూ గుర్తింపు కోసం గళమెత్తిన మహనీయుడు, క్రైస్తవ మత మార్పిడి దుష్ట పన్నాగాల నుంచి గిరిజనులను రక్షించడానికి కృషి చేసిన మహానుభావుడు, దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన వీరయోధుడు బిర్సా ముండాను స్మరించుకోవడం అంటే జాతీయ చైతన్యపు స్వరాన్ని తెలుసుకోవడమే.