పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్ల స్థలంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో ప్రకటించారు. పట్టణ పేదలకు 2 సెంట్ల భూమిలో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఐదేళ్లలో 40 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 24 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని, మరో 16 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు.రాబోయే కొద్ది రోజుల్లోనే లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.
వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక జోన్లు వస్తున్నాయని చంద్రబాబు వెల్లడించారు. నక్కపల్లి, కొప్పర్తి పారిశ్రామిక జోన్లలో రెండేళ్లలో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రెండు లక్షల 94 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కన్నా ఎక్కువని చెప్పారు. అభివృద్ధి చేసుకుంటూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.ఎన్ని అడ్డంకులు ఉన్నా పట్టుదలతో ముందుకు వెళుతున్నామని చంద్రబాబు శాసనసభలో చెప్పారు.