విజయవాడలోని సుబ్బయ్యగారి హోటల్లో గురువారం మధ్యాహ్నం ఒక వినియోగదారుడికి వడ్డించిన భోజనంలో జెర్రి కనబడడం కలకలం రేపింది. అదే సమయానికి అదే హోటల్లో ఎన్హెచ్ఆర్సి యాక్టింగ్ చైర్పర్సన్ అదే హోటల్లో భోజనం చేస్తూండడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేసారు. దాంతో ఆహార భద్రతా విభాగం అధికారులు హోటల్‌ను సీజ్ చేసారు.
గురువారం మధ్యాహ్నం సుబ్బయ్యగారి హోటల్లో భోజనం చేస్తున్న ఒక వ్యక్తికి ఆహారంలో జెర్రి వచ్చింది. అతను హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో అదే హోటల్లో జాతీయ మానవహక్కుల సంఘం యాక్టింగ్ చైర్పర్సన్ విజయభారతి సయాని ఉన్నారు. ఆమె వ్యక్తిగత పనులపై విజయవాడ వచ్చి, తన సిబ్బందితో మధ్యాహ్న భోజనానికి ఆ హోటల్‌కు వెళ్ళారు. విషయం తెలియడంతో విజయభారతి హోటల్ నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. విజయవాడలో ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలూ ఉండే ప్రదేశంలోని హోటల్లోనే ఇలా జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లా అధికారులకు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకూ ఫిర్యాదు చేసారు.
జాతీయ మానవహక్కుల కమిషన్ యాక్టింగ్ ఛైర్పెర్సనే స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఆహార భద్రత, మునిసిపల్ కార్పొరేషన్, తదితర విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే హోటల్‌ను సీజ్ చేసారు. ఆ సంఘటన నేపథ్యంలో నగరంలోని అన్ని హోటళ్ళలోనూ తనిఖీలు నిర్వహించాలని విజయభారతి ఆదేశించారు.