ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్రప్రభుత్వం 2021 నుంచి ప్రతీ యేటా నవంబర్ 15న ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా వేడుకలు జరుపుతోంది. ఈ యేడాది బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ బిహార్లోని జముయ్లో జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకల్లో పాల్గొన్నారు. భగవాన్ బిర్సాముండాకు పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
ప్రధాని మోదీకి జముయ్ ప్రాంత ఆదివాసీలు తమ సంప్రదాయిక నాట్యప్రదర్శనతో ఆహ్వానం పలికారు. వారితో కలిసి ప్రధాని ఆదివాసీల సంప్రదాయ ఢోల్ వాద్యాన్ని వాయించారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీకి బిర్సాముండా ప్రతిమను బహూకరించారు.
భగవాన్ బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్ధం ప్రత్యేక నాణేన్ని, స్మారక స్టాంపును రూపొందించారు. వాటిని ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేస్తారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి రూ.6640 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆదివాసీలు, గిరిజనులకు సహకరించే ఉద్దేశంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టారు.
జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ (పిఎం-జన్మన్) పథకం కింద నిర్మించిన 11వేల ఇళ్ళ గృహప్రవేశాల కార్యక్రమంలోనూ మోదీ పాల్గొంటారు.