శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే నేతృత్వంలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) మెజారిటీ సాధించింది. శ్రీలంక ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఎన్‌పీపీ సారధ్యంలోని కూటమి 107 సీట్లలో విజయం సాధించింది. దాదాపు 62 శాతం అంటే 6.8 మిలియన్ ఓట్లు కూటమికి పడినట్లు ఎన్నికల కమిషన్ తన వెబ్ సైట్లో పేర్కొంది. మూడింట రెండొంతుల మెజారిటీని కూటమి సాధించింది. రాజధాని కొలంబో శివార్లలో ఎన్‌పీపీ మద్దతుదారులు విజయ సంబరాల్లో మునిగిపోయారు.
విపక్ష నేత సజిత్ ప్రేమదాస నేతృత్వంలోని సమగి జన బలవేగయ పార్టీ కేవలం 28 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. పోలైన ఓట్లలో ఆ పార్టీకి దాదాపు 18 శాతం ఓట్లుపడినట్లుగా ఈసీ లెక్కల ప్రకారం స్పష్టమవుతోంది. మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మద్దతుగా ఉన్న న్యూ డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం మూడు సీట్లే గెలుచుకుంది.
శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం 225 సీట్లు ఉండగా దామాషా ప్రాతినిధ్య విధానం ప్రకారం 196 మంది సభ్యులను ఓటర్లు నేరుగా పార్లమెంటుకు ఎన్నుకుంటారు. ఇక మిగిలిన 29 మంది స్థానాలను దామాషా ఓటు ప్రకారం భర్తీ చేస్తారు. పార్టీలకు వచ్చిన ఓటు శాతం మేరకు సీట్లు కేటాయిస్తారు.