మద్యం అమ్మకాల్లో వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై సీఐడి విచారణ జరిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర శాసనసభలో స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం టెండర్ల ద్వారానే ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి గుర్తుచేశారు.
నాసిరకం మద్యం అమ్మడం, అమ్మిన మద్యానికి నగదు లావాదేవీలు మాత్రమే జరపడం ద్వారా వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నాసిరకం మద్యం తాగి లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారని ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల ద్వారా జరిగిన అవినీతిని వెలికితీసేందుకు సిఐడి విచారణ జరిపిస్తామని చెప్పారు.
మద్యం దుకాణాల ద్వారా అమ్మిన సరకు వివరాలు లెక్కల్లో చూపకుండా, జీఎస్టీ ఎగవేసి వేల కోట్లు నగదు ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహించినట్లు తమ విచారణలో తేలిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలో దీనిపై పూర్తి ఆధారాలు సేకరించేందుకు సీఐడి విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.