తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు, ఆలయాలు మహాదేవుడి స్మరణతో మార్మోగుతున్నాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా తెల్లవారు జామున నదులు, సముద్రాల్లో పుణ్యస్నానాలు చేసిన భక్తులు గంగమ్మకు పూజలు చేసి హారతులు ఇచ్చారు. అనంతరం సమీపంలోని శైవాలయాలకు వెళ్ళి పార్వతీపతిని దర్శించి తరించారు.
అమరావతిలో కృష్ణానదిలో మహిళలు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించి తెప్పలు వదిలారు. కోస్తా ప్రాంతపరిధిలోని సూర్యలంక, చీరాల, చినగంజాం, పెదగంజాం, మచిలీపట్నం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణలో పాల్గొంటే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 365 ఒత్తులతో కార్తిక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. అమరావతి, ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.
కృష్ణా జిల్లా మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. కృష్ణమ్మ కడలిలో కలిసే పవిత్ర సంగమం లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులతో హంసలదీవి కిటకిటలాడుతోంది.