కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం స్థానికసంస్థల ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు వస్తాయని భావించిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జారీ చేసి నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.
వైసీపీ నుంచి మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హడు అంటూ మండలి చైర్మన్ వేటు వేశారు. దీనిని రఘురాజు హైకోర్టులో సవాలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న తరువాత మండలి చైర్మన్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రఘురాజు అనర్హత వేటు చెల్లదని, ఆయన ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని తేల్చి చెప్పింది. హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుతో ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్రఎన్నికల సంఘం ప్రకటించింది.
శాసనసభ ఎన్నికల్లో విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గ స్థానంలో అప్పటి ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు వైసీపీ టికెట్ ఇవ్వొద్దని ఎమ్మెల్సీ రఘురాజు అధిష్టానాన్ని కోరారు. కానీ హైకమాండ్ శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వడంతో మనస్తాపానికి గురైన రఘురాజు, తన కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి టీడీపీకి అనుకూలంగా పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని వైసీపీ నేతలు మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో మోషేన్ రాజు, రఘురాజుపై అనర్హత వేటు వేశారు. దీనిని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు.