ఖలిస్థాన్ వేర్పాటువాదులు హిందూ దేవాలయాలు, భక్తులపై దాడుల నేపథ్యంలో కెనడాలో నిరసనలు పెరిగిపోయాయి. శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కూడా హింసాత్మకంగా మారడంతో కెనడాలోని పలు నగరపాలక సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రార్థనా మందిరాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిరసనలు చేపట్టరాదని తీర్మానించాయి. తాజాగా బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ప్రార్థనా మందిరాలకు 100 మీటర్ల పరిధిలో నిరసనలపై నిషేధం విధించారు. ఇప్పటికే
మిస్ససాగు నగరంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు.
గత నెలలో బ్రాంప్టన్ హిందూ దేవాలయంపైన, భక్తులపైనా ఖలిస్థాన్ వేర్పాటు వాదులు దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులను నిరసిస్తూ గురుగోబింద్ సభ దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపట్టింది. నిరసన కారులపై ఖలిస్థాన్ వేర్పాటు వాదులు దాడులకు దిగుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య తరవాత కెనడాలో హిందూ దేవాలయాలు, భక్తులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. బ్రాంప్టన్ హిందూ సభ దేవాలయంపై జరిగిన దాడితో కెనడాలో నిరసనలు మిన్నంటాయి. ఇక ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హెచ్చరికలతో భారత్ అప్రమత్తమైంది. కెనడాలో కాన్సులేట్ క్యాంపులను కూడా మూసివేసింది. ఉన్నత విద్యకోసం మంజూరు చేసే వీసాలపై కెనడా కోత విధించింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.