డొమినికా తమ దేశపు అత్యున్నత పురస్కారమైన ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’ను భారత ప్రధాని నరేంద్రమోదీకి ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో డొమినికాకు చేసిన సహాయానికి, ఇరుదేశాల మధ్యా సంబంధాల బలోపేతానికి చేసిన కృషికీ ఆయనకు ఆ పురస్కారం ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 19 నుంచి 21 వరకూ జార్జిటౌన్, గయానాలో జరగబోయే భారత్-కారికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అధ్యక్షుడు సిల్వానే బర్టన్ ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేస్తారు.
2021 ఫిబ్రవరిలో భారతదేశం డొమినికాకు 70వేల డోసుల ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్‌ను అందజేసింది. అది తమకు ఉదారమైన సాయంగా డొమినికా పేర్కొంది. తమతో పాటు మరికొన్ని కరీబియన్ ద్వీపదేశాలకు కూడా ఆ వ్యాక్సిన్‌ను అందజేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం తమకు వైద్యసంరక్షణ, విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో అందిస్తున్న సహకారానికి గుర్తింపుగా, ఆయనకు కృతజ్ఞతగా ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు డొమినికా ప్రధానమంత్రి రూజ్‌వెల్ట్ స్కెరిట్ చెప్పారు. మోదీని సత్కరించుకోవడం తమకు దక్కిన గౌరవమని ఆయన అన్నారు.
నరేంద్రమోదీ డొమినికా పురస్కారానికి అంగీకారం తెలుపుతూ పంపిన సందేశంలో వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ ఘర్షణల వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించుకోడానికి ఇరుదేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.