రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకలో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
సెప్టెంబర్ 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించలేకపోయిన అనురా కుమార డిస్సనాయకే ఈసారి ఆధిక్యం కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తం 225 పార్లమెంట్ స్థానాలకు నేడు ఎన్నికలు జరగగా 8,821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 1.70 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికలు సాఫీగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు 90వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 13,314 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.