జవహర్లాల్ నెహ్రూ పుట్టి నేటికి 135 ఏళ్ళు గడిచింది. ఆయన కాలం చేసి కూడా 60ఏళ్ళు గడిచిపోయాయి. స్వతంత్ర పోరాటంలో గాంధీ అనుచరుడిగా, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ ఘనకీర్తి గురించే కాంగ్రెస్ నేతలు ఇన్నేళ్ళుగా ఊదరగొట్టారు. కానీ ఆయన చేసిన తప్పులు నేటికీ భారతదేశాన్ని వదల్లేదు. నెహ్రూ పాల్పడిన మహాపరాధాలు దేశాన్ని ఇవాళ్టికీ పట్టిపీడిస్తూనే ఉన్నాయి. చరిత్రను నిష్పాక్షిక దృష్టితో చూసినప్పుడే నెహ్రూ తప్పుల ఫలితాలు నేటికీ మనను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్ధం చేసుకోగలం. వాటిలో ప్రధానమైన వాటిని తెలుసుకుందాం.
కశ్మీర్ సమస్య సృష్టికర్త నెహ్రూయే:
దేశ విభజన జరిగిన తర్వాత, కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోడానికి పాకిస్తాన్ తమ భూభాగంలోని ఆదివాసీ మిలిటెంట్లతో భారత్‌పై దాడులు చేసింది. పాకిస్తానీ చొరబాటుదారులు కశ్మీర్ భూభాగంలోకి వచ్చేసారని, వారిని ఏరి పారేస్తామనీ భారత సైన్యం మొత్తుకుంటూనే ఉంది. నెహ్రూ మాత్రం భారత సైన్యం సలహాలను పెడచెవిన పెట్టాడు, ఐక్యరాజ్యసమితి తలుపు తట్టాడు. పొరుగు దేశం చేసిన దాడిని ఎదుర్కోవడం మానేసి ప్రపంచం ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఫలితంగా, విజయాన్ని చేజేతులారా జారవిడిచి ఓటమిని కౌగిలించుకున్నాడు. దాన్ని పాకిస్తాన్ ఈనాటికీ తనకు అనుకూలంగా వాడుకుంటూనే ఉంది. నెహ్రూ ఐరాసకు వెళ్ళాడంటే దానర్ధం కశ్మీర్ వివాదాస్పద భూభాగం తప్ప భారత్‌లో అంతర్భాగం కాదని వాదిస్తూనే ఉంది. కశ్మీర్ కోసం వేలాది భారత సైనికులు రక్తం చిందించారు, నేటికీ చిందిస్తూనే ఉన్నారు.
ఐరాసలో శాశ్వత సభ్యత్వాన్ని వదిలేసిన మహానుభావుడు:
చైనాతో ఘర్షణలను తప్పించుకునేందుకు అమెరికా, సోవియట్ యూనియన్ ఒకేమాట మీదకు వచ్చిన సందర్భమది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా బదులు భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని ఆ రెండు దేశాలూ ప్రతిపాదించాయి. చైనా మీద అపారమైన ప్రేమాభిమానాలతో నెహ్రూ ఆ ఆఫర్‌ను వదులుకున్నాడు. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఉండి ఉంటే భారతదేశం ప్రపంచ వ్యవహారాల్లో వేరే స్థాయిలో ఉండేది. భారత్ ఎలాంటి రాజీ పడనక్కరలేకుండా శాశ్వత సభ్యత్వం ఇస్తామన్న ప్రతిపాదనను తిరస్కరించడం నెహ్రూ చేసిన మహాపరాధం. అలా అని, చైనాతో ఆయన ఆశించిన సత్సంబంధాలు ఏర్పడ్డాయా అంటే లేదన్న సంగతి తెలిసిందే.
చైనా యుద్ధంలో భారత్ ఓటమికి కారకుడు:
నెహ్రూ చైనాను ఎంతగా నమ్మినా, స్నేహహస్తం అందించినా, దాన్ని చైనా ఏకపక్షంగా వాడుకుందే తప్ప భారత్‌ను మిత్రదేశంగా గుర్తించలేదు. అంతేనా. తమను గుడ్డిగా నమ్మిన నెహ్రూను ఇంగ్లండ్, అమెరికా దేశాల తొత్తు అంటూ ఈసడించుకుంది. ఐక్యరాజ్యసమితిలో తమకు శాశ్వత సభ్యత్వం ఇచ్చేసిన భారత్‌ను అవమానిస్తూ నిందాకరంగా ఐరాసలో ప్రసంగాలు చేసింది. చైనా ఉద్దేశాలను నెహ్రూ ఏనాడూ సరిగ్గా అర్ధం చేసుకోలేదు. వివరించి చెప్పినవారిని కోపగించుకుని దూరం పెట్టాడు. 1962లో మావో భారత్‌ను ఆక్రమిస్తాడని నెహ్రూ ఊహించలేకపోయాడు.
అంతేకాదు, చైనా దండయాత్ర చేసాక కూడా భారతసైన్యాన్ని తన పని తను చేసుకోనీయలేదు. నెహ్రూ తప్పుడు అంచనాలతో భారత సైన్యం చేతులు కట్టేసాడు. దాంతో ఆ యుద్ధంలో 3250మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం 43వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయింది. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. ఇప్పటికీ చైనా మన దేశానికి పెద్ద సమస్యగానే ఉంది.
అందరికీ ప్రాథమిక విద్యను ప్రోత్సహించడంలో విఫలం:
నెహ్రూ హయాంలోనే దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు వచ్చాయన్న మాట నిజమే. కానీ దేశ ప్రజలందరినీ అక్షరాస్యులను చేయడం గురించి నెహ్రూ పట్టించుకోలేదు. అందరికీ ప్రాథమిక విద్య అనే అంశానికి ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదు. దేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ఆ కాలంలో ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడం దిగ్భ్రాంతికరమైన విషయం. దేశం ఆర్థికంగానూ, సామాజికంగానూ అభివృద్ధి చెందడానికి నిరక్షరాస్యత పెద్ద అవరోధంగా నిలిచింది. నెహ్రూ జీవిత చరిత్ర రాసిన జుడిత్ బ్రౌన్ ఈ అంశాన్ని నెహ్రూ అతిపెద్ద పరాజయంగా అభివర్ణించాడు.
స్వేచ్ఛావిపణి పెట్టుబడిదారీ వ్యవస్థకు బదులు సామ్యవాదానికి ప్రోత్సాహం:
భారతదేశం సంప్రదాయికంగా స్వేచ్ఛావిపణి ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తూ వచ్చింది. ప్రైవేటు వ్యక్తుల వాణిజ్య వ్యాపారాలపైనే దేశీయ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉండేది. దాన్ని నెహ్రూ తిరస్కరించాడు. ‘లాభం అనేది తప్పుడు పదం’ అని నెహ్రూ వ్యాఖ్యానించాడు. ఆయన సోవియట్ నమూనా ఆర్థిక విధానాలను అనుసరించాడు. అందులో, పరిశ్రమల నుంచి హోటళ్ళ వరకూ అన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. సాధారణ ప్రజలు భారీగా ఆస్తులు కూడగట్టకుండా అధిక పన్నులు విధించాడు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను నిరుత్సాహపరిచాడు.
నెహ్రూ ఆర్థిక విధానాలు సమాజంలో అంతరాలను పెంచాయి. ప్రజల ఆదాయాల్లో అసమానతలకు కారణం అయ్యాయి, క్రోనీ క్యాపిటలిజానికి తావిచ్చాయి. అంతేకాదు… సంపద, విజయం అనేవి దుర్మార్గమైన విషయాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనైతికం అనే విషభావనలను సాధారణ ప్రజల మనసుల్లోకి ఎక్కించిన ఘనత నెహ్రూ ఆర్థిక విధానాలదే. ఆర్థిక సరళీకరణ తర్వాత కూడా నేటికీ అదే రకమైన ఆలోచనా ధోరణి మనదేశంలో కొనసాగుతూనే ఉందంటే దానికి కారణం నెహ్రూయే.
అలీనోద్యమం అనే తప్పుడు ఆలోచనను రుద్దాడు:
సోవియట్ యూనియన్‌తో ప్రచ్ఛన్న యుద్ధం తారస్థాయిలో ఉన్న దశలో అమెరికా దేశం ఆసియా ఖండంలో మిత్రదేశాల కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ముఖ్యంగా భారత్‌తో స్నేహం కోసం ప్రయత్నించింది. అయితే నెహ్రూ ఆ స్నేహహస్తాన్ని తిరస్కరించాడు. దానికి బదులు వాస్తవికంగా ఆచరణ సాధ్యం కాని, ఊహాజనితమైన తటస్థ విధానాన్ని ఎంచుకున్నాడు. అప్పటి సూపర్ పవర్స్ అయిన అమెరికా, సోవియట్ యూనియన్లలో ఎవరివైపూ మొగ్గబోనంటూ ఆదర్శాలు మాట్లాడాడు. 1961 నాటికి అలీనోద్యమం ఏర్పాటుకు సాయపడ్డాడు.
అప్పుడు అమెరికా పాకిస్తాన్‌తో దోస్తీ కుదుర్చుకుంది. ఆ అపవిత్ర పొత్తు నేటికీ బలంగానే ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో భారత్, సోవియట్ యూనియన్ను మిత్రదేశంగా అంగీకరించింది. అలా, అలీన విధానం లక్ష్యమే గంగలో కలిసిపోయింది. దాని ప్రభావంతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు చాలా దశాబ్దాల పాటు దెబ్బతిన్నాయి.
భారత్‌లో చేరతానన్న నేపాల్ ప్రతిపాదన తిరస్కరణ:
నేపాల్ రాజు బిక్రమ్ షా, భారతదేశంలో ఒక భాగంగా చేరతానంటూ ప్రతిపాదన చేసాడు. ఆ ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించాడు. నేపాల్ స్వతంత్ర దేశమనీ, అది అలాగే ఉండాలనీ ఆయన భావించాడు.
భారత్‌లో చేరతానన్న బలోచిస్తాన్ ప్రతిపాదన తిరస్కరణ:
బలోచిస్తాన్‌ను భారత్‌లో కలుపుతానంటూ ఆ ప్రాంతపు రాజు (ఖాన్ లేక కలత్) మీర్ అహ్మద్యార్ ఖాన్ ప్రతిపాదించాడు. కానీ నెహ్రూ దానికి ఒప్పుకోలేదు. వ్యూహాత్మకంగా బలోచిస్తాన్ ప్రాధాన్యతను అర్ధం చేసుకోలేక పోయాడు ఆయన. దాంతో పాకిస్తాన్ ఆ ప్రాంతంలో నేటికీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది.
అణు ఒప్పందానికి నిరాకరణ:
భారతదేశానికి పరమాణు పరికరాన్ని తయారుచేసుకోవడంలో సహాయం చేస్తానంటూ 1964లో అమెరికా ప్రతిపాదించింది. అహింసా సిద్ధాంత సమర్ధకుడు అయిన కారణంగానే కావచ్చు, నెహ్రూ అమెరికా ప్రతిపాదనను తిరస్కరించాడు. దాన్నే కనుక నెహ్రూ ఒప్పుకొని ఉండి ఉంటే, భారతదేశం ఆసియాలో మొదటి పరమాణు పరీక్ష చేసిన దేశంగా నిలిచి ఉండేది. అదే జరిగి ఉంటే 1962లో చైనా భారత్ మీద యుద్ధానికి సాహసించేది కాదు. 1965లో భారత్ మీద యుద్ధానికి సాహసించవద్దని పాకిస్తాన్‌కూ సలహా ఇచ్చి ఉండేది.
పాత్రికేయ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛపై ఉక్కుపాదం:
నెహ్రూ గొప్ప ఉదారవాద ప్రజాస్వామ్యవాది అనే ప్రచారం అమల్లో ఉంది. నిజానికి ఆయన ఆ నియమాలకు ఎప్పుడూ కట్టుబడి లేడు. 1950లో భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకు భావప్రకటనా స్వేచ్ఛ కల్పించింది. పాకిస్తాన్ హిందువులను ఊచకోత కోసినప్పుడు ఆ దేశపు విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నాలు చేయాలని నెహ్రూ ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనను ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ తీవ్రంగా విమర్శించింది. ‘పాకిస్తాన్ దుర్మార్గం మన మూర్ఖత్వం ఫలితమే’ అంటూ ఓ వ్యాసాన్ని ప్రచురించింది.
దాంతో నెహ్రూకు ఒళ్ళు మండిపోయింది. ఆర్గనైజర్ పత్రికతో పాటు, ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళందరి నోళ్ళూ మూయించడమే లక్ష్యంగా రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేసాడు. భావప్రకటనా స్వేచ్ఛకూ ఆంక్షలు విధించాడు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ సవరణను తమ అవసరాలకు అనుగుణంగా దుర్వినియోగం చేసాయి.
కేరళలో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలదోసిన ఘనత:
కేరళలో 1957లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిచారు. ఇఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మరికొన్ని రియాక్షనరీ శక్తులతో కలిసి ‘విమోచన సమరం’ చేపట్టింది.
ఆ సమయంలో కేరళలో కృత్రిమంగా సృష్టించిన ఆందోళనలు, నిరసనలూ చాలా జరిగాయి. అవన్నీ ఒకటే పిలుపునిచ్చాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం గద్దె దిగిపోవాలి అన్నదే వాటి లక్ష్యం. ఆ ఆందోళనలు తారస్థాయికి చేరినప్పుడు కేంద్రప్రభుత్వం 1959లో కేరళ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసింది. కేరళ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేలా కాంగ్రెస్ పార్టీ పన్నిన వ్యూహం వెనుక కమ్యూనిస్టులకు పూర్తి వ్యతిరేకమైన అమెరికా నిఘా వర్గాల కుట్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉదారవాద ప్రజాస్వామికుడు అని గొప్పగా పేరు తెచ్చిపెట్టుకున్న నెహ్రూ, దేశ ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకున్న విదేశీ శక్తులతో చేతులు కలపడంలో ఎలాంటి దోషమూ లేదని భావించడం గమనార్హం.
అవినీతిని విస్మరించిన అపకీర్తి:
నెహ్రూ తన మిత్రులు పాల్పడిన అవినీతి విషయంలో ఎప్పుడూ కళ్ళుమూసుకుని ఉండేవాడు. వి కె కృష్ణమీనన్ నెహ్రూకు అత్యంత సన్నిహితుడు. 1948లో జీపుల కుంభకోణంలో ఆయనదే ప్రధాన పాత్ర. కొన్నేళ్ళ తర్వాత ఎల్ఐసి ముంద్రా కుంభకోణం జరిగింది. ఆ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించింది నెహ్రూ అల్లుడు, కాంగ్రెస్ ఎంపీ అయిన ఫిరోజ్ గాంధీయే. చివరిగా, నెహ్రూ హయాంలోనే సైకిళ్ళ దిగుమతి కుంభకోణం కూడా జరిగింది.
గోవా విషయంలో ఉదాసీనత:
భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చాక, గోవా నుంచి వైదొలగాలంటూ నెహ్రూ పోర్చుగల్‌ను కోరాడు. దానికి సహజంగానే పోర్చుగల్ ఒప్పుకోలేదు. దేశ అంతర్గత సమస్యలను సైతం ప్రపంచం ముందు పెట్టి అడుక్కునే విధానానికి ఆద్యుడైన నెహ్రూ, ఈ విషయాన్ని కూడా ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడు. పోర్చుగల్ అక్కడ కూడా మళ్ళీ నిరాకరించింది.
ఎట్టకేలకు 1961లో భారత సైన్యం ముందడుగు వేసింది. పోర్చుగీసు వారు భారతీయుల చేపల పడవలపై కాల్పులు జరిపి, ఒక జాలరిని చంపేసారు. అప్పుడు భారత సైన్యం పోర్చుగీసు వారిపై దాడులు మొదలుపెట్టింది. వాయు, సముద్ర, భూ మార్గాలు మూడింటిలోనూ 36 గంటల పాటు దాడులు చేసాక పోర్చుగీసువారు గోవాను భారత్‌కు స్వాధీనం చేసి వెళ్ళారు. నిజానికి ఆ చర్య చాలా ముందు చేయవలసినది. నెహ్రూ ఊగిసలాట ధోరణి, పిరికితనం వల్లనే గోవా ప్రజలు స్వతంత్రం కోసం మరో 14 సంవత్సరాలు వేచిచూడవలసి వచ్చింది.
అధికార కండూతి:
దశాబ్ద కాలం ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత నెహ్రూ అధికారాన్ని వదిలేసి ఉండాల్సింది అని ఆయన జీవిత చరిత్ర రాసిన జుడిత్ బ్రౌన్ వ్యాఖ్యానించాడు. కానీ, తమ సమయం ముగిసిపోయిందని గ్రహించని రాజకీయ నాయకులు అందరిలాగే నెహ్రూ కూడా కుర్చీకి అంటిపెట్టుకుని ఉండిపోయాడు. దానివల్ల నష్టం వాటిల్లింది దేశానికే.
నెహ్రూ బదులు యువకుడైన, చురుకైన నాయకుడు అధికారంలో ఉండిఉంటే చైనాతో మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉండేవాడు. బహుశా, చైనా-భారత్ యుద్ధం ఫలితం కూడా మరోలా ఉండిఉండేదేమో.
ముగింపు:
ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం, పరమాణు రంగంలో అమెరికా సహకారం, భారత్‌లో చేరతామన్న నేపాల్-బలోచిస్తాన్… వంటి అనేకమైన, దేశానికి మేలు చేసే ప్రత్యక్ష ప్రతిపాదనలను నెహ్రూ మూర్ఖంగా తిరస్కరించాడు. ఆర్థిక, విద్యా రంగాల్లో సాధికారత సాధించడంలో ఆయన వైఫల్యాలు భారతీయుల ఎదుగుదలకు గండికొట్టాయి. దేశ అంతర్గత విషయాల్లో ఊగిసలాట ధోరణి, గందరగోళపడడం, ద్వైపాక్షిక విషయాలను రచ్చకెక్కించి ఐక్యరాజ్యసమితి జోక్యం కోసం ప్రాకులాడడం వల్ల గోవా స్వతంత్రం చాలా ఆలస్యమైంది, కశ్మీర్ దాదాపు ఏడు దశాబ్దాలు భారతదేశపు గుండెల మీద కుంపటిలా నిలిచింది. ఆత్మీయుల అవినీతిని విస్మరించాడు, తనను ఓడించిన ప్రతిపక్షాలతో, విమర్శించిన పత్రికలతో అప్రజాస్వామికంగా ప్రవర్తించాడు.
నెహ్రూ చేసిన అసంఖ్యాకమైన తప్పులకు దేశం ఈనాటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధలు పడుతూనే ఉంది.