లాటరీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న తమిళనాడుకు చెందిన శాంటియాగో మార్టిన్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై సహా దేశంలోని పలు నగరాల్లో శాంటియాగో ఆస్తులపై ఈడీ సోదాలు చేస్తోంది. గతంలో మార్టిన్‌పై ఉన్న కేసును మూసివేయాలని పోలీసులే కోర్టులో చెప్పడంతో అవి మూతపడ్డాయి. కేసులు మూసివేయడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో మరలా వాటిని తెరిచారు. సిక్కిం ప్రభుత్వానికి లాటరీల పేరుతో రూ.900 కోట్ల నష్టం వాటిల్లేలా చేశాడని, తద్వారా రూ.450 కోట్లు హవాలా మార్గంలో మళ్లించాడనే కేసును ఎదుర్కొంటున్నాడు
మయన్మార్ దేశానికి చెందిన శాంటియాగో మార్టిన్ నాలుగు దశాబ్దాల కిందట తమిళనాడు చేరుకున్నాడు. అక్కడ లాటరీల వ్యాపారం ప్రారంభించి, కర్ణాటక, కేరళ, సిక్కిం, నేపాల్ కు విస్తరించారు. ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లాటరీ వ్యాపారంతోపాటు, రియల్ ఎస్టేట్, హోటల్స్, నిర్మాణరంగాల్లోనూ ప్రవేశించాడు. కోయంబత్తూరులో శాంటియాగో మార్టిన్‌పై భూ కబ్జా కేసు నమోదైంది.
గత ఏడాది దేశంలో అందరికంటే ఎక్కువగా పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1300 కోట్లు విరాళాలు అందించి శాంటియాగో మార్టిన్ వార్తల్లో నిలిచాడు. అండర్ వరల్డ్ డాన్‌లా చలామణి అవుతూ లాటరీల ద్వారా సంపాదించిన వేల కోట్లు మనీలాండరింగు ద్వారా విదేశాలకు తరలిస్తున్నాడని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.