వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిపై మరో అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పటికే అతనిపై కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తాజాగా సిద్దవటం మండలానికి చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్రా రవీందర్‌రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమీప బంధువు అర్జున్‌రెడ్డిపై కేసు నమోదైంది.
ఏపీలో వైసీపీ సోషల్ మీడియాకు చెందిన 56 మంది కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 16 మందిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్, వర్రా రవీందర్‌రెడ్డి, అశోక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి,సుధారెడ్డి, హరనాధరెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల కుమారుడు వైసీపీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు సజ్జల భార్గవ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఇక వైసీపీ పాలనా కాలంలో రెచ్చిపోయి భూతులు తిట్టిన శ్రీరెడ్డిపై రాజమండ్రి, అనంతపురం జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌పై శాసనమండలిలో చర్చ చేపట్టాలంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. తీవ్ర నిరసనలతో సభను స్పీకర్ కాసేపు వాయిదా వేశారు.