మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే ఏపీ శాసనమండలి వాయిదా పడింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్సార్సీపీ డిమాండ్ చేయగా చైర్మన్ నిరాకరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం చుట్టుముట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
సోషల్ మీడియా అరెస్టులతో పాటు డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం కోరింది. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. దీంతో పోడియం వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ‘‘వీ వాంట్ జస్టిస్..’’, ‘‘సేవ్ డెమోక్రసీ’.. అంటూ నినదించారు. నినాదాల నడుమ సభ జరిపేందుకు చైర్మన్ ప్రయత్నించారు. గందరగోళ మరింత పెరగడంతో మండలిని కాసేపు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. రఘురామకృష్ణంరాజు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఎన్డీయే ప్రభుత్వం నేడు శాసనసభలో పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది.
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు – 2024,ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రసిటీ డ్యూటీ బిల్లు – 2024, ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ బిల్లు – 2024, ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్, హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ బిల్లు – 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు – 2024, ఆంధ్రప్రదేశ్ MSME డవలప్మెంట్ పాలసీ 2024 – 29 లు సభమందుకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 – 29.. పై సభ లో మంత్రి టీజీ భరత్ స్టేట్మెంట్ ఇవ్వనున్నారు.