భారత్ చైనా రక్షణ మంత్రుల సమావేశం త్వరలో జరగనుంది. ఆసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో భాగంగా ఈ భేటీ జరగనుంది. సరిహద్దు సమస్యలపై ప్రధానంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, డోంగ్ జున్‌లు చర్చించే అవకాశముందని తెలుస్తోంది. గత నెలలో చైనాతో కుదిరిన ఒప్పందం మేరకు లద్దాఖ్ సరిహద్దులో రెండు దేశాలు సైనికులను ఉపసంహరించుకుంటున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల వల్ల రెండు దేశాల వాణిజ్యం దెబ్బతినడంతోపాటు దౌత్యసంబంధాలకు బీటలు వారుతున్నాయి.
2020 జూన్ 15న భారత, చైనా సరిహద్దు లద్దాఖ్‌లో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. చైనా సైనికుల దాడిలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందారు. వీరిలో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు కూడా వీర మరణం పొందారు.
చైనాకు చెందిన సైనికులు కూడా చనిపోయారు. అయితే చాలా ఆలస్యంగా తమ దేశానికి చెందిన ఐదుగురు సైనికులు మరణించారని చైనా ప్రకటించింది.
లద్దాఖ్ సరిహద్దులో ఇరు దేశాలు అవుట్ పోస్టులను ఇప్పటికే ఖాళీ చేయడం ప్రారంభించాయి. సైనిక బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. దీని ద్వారా సరిహద్దులో ఉద్రిక్తతలకు తావులేకుండా చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. భారత్,చైనా సైనిక అధికారులు ఏ క్షణంలోనైనా లద్దాఖ్ పరిసరాలను పరీక్షించుకునే విషయంలోనూ ముందడుగు పడింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇరుదేశాలు లద్దాఖ్ ప్రాంతాన్ని పరిశీలించుకునే అవకాశం కలగనుంది.