జమ్మూ కశ్మీర్లో విదేశీ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిఘావర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లోకి చొరబడడం మానిన ఉగ్రవాదులు అంతర్గత ప్రాంతాల్లో దాక్కొని దాడులకు తెగబడుతున్నాయని వెల్లడించాయి. ముష్కరులకు స్థానికంగా అందే సహకారం తక్కువగానే ఉందని అంచనా వేశాయి.
ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో 119 మంది ఉగ్రవాదులు ఉండగా, 79 మంది పీర్ పంజాల్లో ఉన్నారు. 18 మంది స్థానికులు, 61 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు ఉన్నట్లు లెక్కతేల్చాయి. పీర్ పంజాల్కు దక్షిణాన 40 మంది ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారు. ఇందులో 34 మంది పాకిస్తానీయులతో పాటు ఆరుగురు ఆరుగురు స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 25 ఉగ్రదాడులు జరగగా, 24 మంది జవాన్లు చనిపోయారు. 61 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో 21 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు.
నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి సైనిక సన్నద్ధతపై సమీక్షించారు. అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ ముమ్మరం చేయాలని ఆదేశించారు.