విశాఖపట్నం జిల్లాలో డయేరియాతో మరణాల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ శాసన మండలి సమావేశాల నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. డయేరియా మరణాలు లేవంటూ మంత్రి శాసనమండలి ప్రకటించడాన్ని తప్పుబట్టిన వైసీపీ ఎమ్మెల్సీలు, సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. మండలి ప్రతిపక్ష వైసీపీ నేత , మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డయేరియా కేసుల గురించి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. మంత్రి సత్యకుమార్ సమాదానమిస్తూ డయేరియాతో ఎవరూ చనిపోలేదని సమాదానం ఇచ్చారు.
మంత్రి సమాధానంపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. గుర్ల గ్రామంలో డయేరియాతో 200 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారని, పదుల సంఖ్యలో చనిపోయరాన్నారు. అధికారులు కూడా గుర్ల వచ్చి పరిశీలించారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వచ్చి 10 మంది చనిపోయారని చెప్పారని గుర్తు చేశారు.కానీ సంబంధిత మంత్రి ఎవరూ చనిపోలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు
డయేరియా మరణాలను తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందన్న బొత్స, బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ రూ. 2 లక్షల సహాయం చేశారన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు పరిహారం ప్రకటించలేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి తమ పార్టీ ప్రతినిధులు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.