సీనియర్ల ప్రాక్టిస్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టు కోసం ఇంట్రా-స్క్వాడ్ 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ని షెడ్యూల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మ్యాచ్ కు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వకూడదని బోర్డు అనుకుంటోంది. తద్వారా సిరీస్ ప్రారంభానికి ముందు జరిగే పరిణామాలు గోప్యంగా ఉంచాలనేది బీసీసీఐ ఆలోచనగా తెలుస్తోంది.
దక్షిణ పెర్త్ లోని డబ్ల్యూఏసీఏ గ్రౌండ్లో ఇంట్రా-స్క్వాడ్ వార్మప్ మ్యాచ్ శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరగనుంది. ఐదు మ్యాచ్ ల బీజీటీ సిరీస్ ఈ నెల 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే మొదటి టెస్టుతో ప్రారంభం కానుంది.
టోర్నీ కోసం విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ వంటి కీలక ప్లేయర్లు ఆసీస్ వెళ్ళారు. ప్రాక్టీస్ సెషన్లు కూడా ప్రారంభించారు.
పెర్త్ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ కు కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. యశస్వి జైస్వాల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. వీరితో పాటు వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కూడా ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.
భారత క్రికెట్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కి అర్హత సాధించేందుకు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను 4-0తో ఓడించాలి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ రెండో స్థానానికి దిగజారింది. ఆస్ట్రేలియా టాప్ లో ఉంది.