ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నవంబర్ 16 నుంచి 21 వరకు రెండు వేర్వేరు ఖండాల్లోని మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్, గయానా దేశాలను మోదీ సందర్శించనున్నారు.
నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుతో సమావేశం అవుతారు. గడిచిన 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
నైజీరియా పర్యటన ముగిసిన తర్వాత అక్కడి నుంచి బ్రెజిల్ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 18, 19 తేదీల్లో రియోడిజనీరో నగరంలో జరగనున్న జీ-20 సదస్సులో మోదీ పాల్గొంటారు. గతేడాది జీ-20 సదస్సును భారత్ వేదికగా జరగగా ఈ సంవత్సరం బ్రెజిల్ వేదికైంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మిట్లో పాల్గొంటారు.
బ్రెజిల్ పర్యటన ముగిసిన తర్వాత గయానాకు వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ తో సమావేశం అవుతారు. గడిచిన 56 ఏళ్ల లో భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి. గయానా పార్లమెంట్ తో పాటు ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. CARICOM సభ్యదేశాల నాయకులతో చర్చలు జరుపుతారు.