మణిపూర్‌లో కుకీల హింసాకాండ కొనసాగుతోంది. జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత వారు ఆరుగురిని కిడ్నాప్ చేసారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్‌పిఎఫ్ పోస్ట్‌పై కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వారిని కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత సాయుధులైన కుకీ ఉగ్రవాదులు బోరోబెక్రా పోలీస్ స్టేషన్ మీద, ఆ చేరువలో జకూర్‌ధొర్‌లోని సిఆర్‌పిఎఫ్ పోస్ట్ మీద దాడి చేసారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వారు
సుమారు గంటసేపు కాల్పులు జరిపారని మణిపూర్ ఐజీ ముయివా వెల్లడించారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో పదిమంది ఉగ్రవాదులు హతమయ్యారు, ఒక సిఆర్‌పిఎఫ్ జవాను గాయపడ్డాడు. ఆ క్రమంలోనే బోరోబెక్రా పోలీస్ స్టేషన్ దగ్గర శరణార్థి శిబిరంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు వృద్ధులను కుకీ ఉగ్రవాదులు హతమార్చారు.
కుకీల దాడి తర్వాత నుంచీ శరణార్థి శిబిరంలో ఉన్నవారిలో ఆరుగురు కనిపించడం లేదు. యురెంబామ్ రాణి (60), థోయిబీ దేవి (31), ఆమె కూతురు తాజమన్‌బీ దేవి (8), లయిష్‌రామ్ హెయితోంబీ దేవి (35), ఆమె ఇద్దరు కొడుకులు లయిష్‌రామ్ చింఖేన్‌గన్‌బా సింగ్ (2.5), లయిష్‌రామ్ లామన్‌గన్‌బా సింగ్ (10నెలలు) అనే ఆరుగురు కనిపించడం లేదు.
శరణార్థి శిబిరంలో మొత్తం 13మంది ఉండేవారు. వారిలో ఇద్దరు కుకీ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. ఐదుగురిని రక్షించారు. ఆరుగురు తప్పిపోయారు అని ఐజీ ముయివా తెలియజేసారు.
మరోవైపు పశ్చిమ ఇంఫాల్‌లోని కాంచప్ చింగ్‌ఖోంగ్ గ్రామంలోకి కుకీ మిలిటెంట్లు రెండు కార్లలో చేరుకున్నారు. నివాస ప్రాంతాలపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దాంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పెద్దసంఖ్యలో ఇళ్ళు, వాహనాలను తగులబెట్టేసారు.