బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడి ఇక్కడ మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న కేసు దర్యాప్తులో భాగంగా పలువురు వ్యక్తుల నివాసాలు, సంస్థల కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేసారు.
ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 17 ప్రదేశాల్లో మంగళవారం సోదాలు చేపట్టి, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ రాంచీ శాఖ అధికారికంగా ప్రకటించింది. ‘‘నకిలీ ఆధార్ కార్డులు, ఫోర్జరీ చేసిన పాస్‌పోర్టులు, అక్రమ ఆయుధాలు, స్థిరాస్తి డాక్యుమెంట్లు, నగదు, ఆభరణాలు, దొంగనోట్లు అచ్చువేసే యంత్రాలు, కాగితాలు, మొదలైనవి స్వాధీనం చేసుకున్నాం’’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.
ఈ కేసు మొదట రాంచీలోని బరియాతు పోలీస్ స్టేషన్ పరిధిలో బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్ల కేసుగా నమోదైంది. తర్వాత ఆ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు బదలాయించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్ల వెనుక ఉన్న పెద్ద మాఫియా నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ఈడీ ప్రయత్నిస్తోంది.