ఛత్తీస్గఢ్లో క్రైస్తవ మత ప్రచారకులు తన ఇంటిని చట్టవిరుద్ధంగా ఆక్రమించారంటూ ఒక వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. తాను వద్దని కోరుతున్నా ప్రార్థనా కూటములు నిర్వహిస్తున్నారనీ, ఇల్లు ఖాళీ చేయకుండా సతాయిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తమ సహాయం కోరడంతో హిందూసంస్థల ప్రతినిధులు ఆదివారం అక్కడకు వెళ్ళి ప్రార్థనా కూటమిని ఆపే ప్రయత్నం చేసారు. అక్కడ గొడవ జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసారు.
దుర్గ్ జిల్లా పుల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యాంబాయి యాదవ్ అనే మహిళ నివసిస్తోంది. తన ఇంటిని ఖాళీ చేయడానికి క్రైస్తవ ప్రచారకులు ఒప్పుకోవడం లేదంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యతిరేకతను పట్టించుకోకుండా తన ఇంట్లో గత ఐదేళ్ళుగా ప్రార్థనా కూటములు నిర్వహిస్తున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కూటములు పెట్టవద్దంటూ తను అభ్యంతరపెట్టినా వారు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
కొన్నేళ్ళ క్రితం శ్యాంబాయి యాదవ్ కుటుంబసభ్యుల్లో ఒక పిల్లవాడికి అనారోగ్యం వచ్చింది. అప్పుడు క్రైస్తవ మిషనరీలు ఆమె కుటుంబానికి ఓదార్పు మాటలు పలికారు. ఆమె కొడుకు రోగం నయం చేస్తామని గప్పాలు కొట్టారు. ఆర్థికంగానూ సాయం చేసారు. అప్పటినుంచీ ఆమె ఇంటినే తమ అడ్డాగా మార్చుకున్నారు. అక్కడ ప్రార్థనా కూటములు నిర్వహించడం మొదలుపెట్టారు. ఎంతకాలం గడిచినా పిల్లాడి ఆరోగ్యం బాగుపడలేదు సరికదా, కొన్నాళ్ళకు అతను చనిపోయాడు. అప్పటినుంచీ ఆ మహిళ తన ఇంటిని విడిచిపోవాలంటూ మిషనరీలను కోరింది. అయితే మిషనరీలు ముందుజాగ్రత్త చర్యగా ఆ వృద్ధురాలితో కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. వారు ఇప్పటికీ ఆ ఇంట్లో ప్రార్థనా కూటములు నడుపుతున్నారు. ఇల్లు ఖాళీ చేయమంటూ వృద్ధురాలు చాలాకాలంగా అడుగుతోంది. అయితే ఆ ఇంటి నిర్మాణానికి సిమెంటు, ఇసుక, ఇటుకలు తామే ఇచ్చామని, అందువల్ల ఆ ఇంటిని వదిలిపెట్టబోమనీ మిషనరీలు స్పష్టం చేసారు.
ఆ నేపథ్యంలో సదరు 70ఏళ్ళ వృద్ధురాలు స్థానిక హిందూ సంస్థల కార్యకర్తలను ఆశ్రయించింది. మొన్న ఆదివారం ఉదయం సుమారు డజను మంది క్రైస్తవులు కూటమిలో ప్రార్థనల కోసం ఆ ఇంటికి వచ్చారు. అదే సమయానికి బజరంగ్ దళ్, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. మిషనరీలతో వాగ్వాదానికి దిగారు. ఘర్షణ పెద్దది అవడంతో పోలీసులు రంగప్రవేశం చేసారు. కూటమి నిర్వహిస్తున్న పాస్టర్ సహా, పదిమందిని అరెస్ట్ చేసారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతన్ని పోలీసు కస్టడీకి పంపించింది.