తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా నిర్వహించారు. కలియుగదైవం శ్రీవేంకటేశుడు కొలువైన తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. తెల్లవారు ఝామున 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తిరుమలలో స్వామివారి ఊరేగింపు సందర్భంగా చిరుజల్లులు కురిశాయి.
వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.