పత్రికా ప్రకటన ద్వారా సీఎం ఆదేశాన్ని తెలియజేసిన కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా
కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం చేపట్టే బోర్ల తవ్వకాల ప్రక్రియను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆందోళన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వివరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా ఓ ప్రకటన జారీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం బోర్ల తవ్వకాల ప్రక్రియ ముందుకు సాగదని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు అని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కర్నూలు జిల్లా పరిధిలో యురేనియం తవ్వకాలపై స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దేవనకొండ మండలం ఈదుల దేవరకొండ వద్ద సోమవారం నాడు నాలుగు గంటలపాటు ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరనసన వ్యక్తం చేశారు. దీంతో రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.