అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో అబార్షన్ మాత్రలకు భారీ గిరాకీ ఏర్పడింది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి రాగానే గర్బవిచ్ఛిత్తిపై నిషేధం విధిస్తానంటూ హామీ ఇచ్చారు. దీంతో అమెరికాలో ముందు జాగ్రత్తగా మహిళలు అబార్షన్ మాత్రల కోసం ఎగబడుతున్నారు. ఎన్నికల ఫలితాల తరవాత దేశంలో అబార్షన్ మాత్రకు 17 రెట్లు డిమాండ్ పెరిగిందని ఓ స్వచ్ఛంధ సంస్థ వెల్లడించింది.
అమెరికా ఎన్నికల ఫలితాల ముందు అబార్షన్ మాత్రల కోసం తమ వెబ్‌సైట్‌లో రోజుకు 4 వేల మంది అన్వేషించే వారని, ప్రస్తుతం ఆ సంఖ్య 80 వేలు దాటిందని ఓ సంస్థ వెల్లడించింది. ముందు జాగ్రత్తగా మహిళలు మాత్రలు సేకరించి పెట్టుకుంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. గర్భిణిలుగా లేని మహిళలు కూడా మాత్రలు సేకరించి దాచుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.
అమెరికాలో గర్బ విచ్ఛిత్తిపై బైడెన్ ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. దీంతో దేశంలో జనాభా పెరుగుదల దారుణంగా తగ్గింది. వలసలు పెరిగిపోయాయి. తాను అధికారంలోకి రాగానే వలసలు నిరోధించి, గర్బ విచ్ఛిత్తిపై నిషేధం విధిస్తానంటూ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వాడారు. కొద్ది రోజుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు. దీంతో లక్షలాది మహిళలు అబార్షన్ మాత్రలే సేకరించి దాచుకుంటున్నారని పలు వ్యాపార సంస్థల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త అమెరికాలో ప్రముఖ పత్రికల్లో ప్రచురితమై చర్చకు దారితీసింది.