తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం రాత్రి శంషాబాద్ మండలం జుక్కల్ గ్రామంలోని ఒక గుడిపై పదిమంది దుండగులు దాడి చేసారు. నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ యథావిధిగా మౌనాన్నే కొనసాగిస్తోంది.
జుక్కల్ గ్రామం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలో నవంబర్ 9 శనివారం రాత్రి పదిమంది గుంపు గ్రామదేవతల గుళ్ళలోకి చొరబడింది. సోమయ్య గుడి, చౌడమ్మ గుడి, పోచమ్మ గుడిలో విగ్రహాల దుస్తులను లాగేసారు, దేవతా మూర్తుల కళ్ళపై తొడుగులు తొలగించారు, కళ్ళను దెబ్బతీసారు.
దాడి చేసిన దుండగులు వెళ్ళిపోయే క్రమంలో గ్రామస్తులు వారిని నిర్బంధించారు. అయితే వారిలో తొమ్మిది మంది తప్పించుకుని పోయారు. కేవలం ఒక్క యువకుడు మాత్రమే పట్టుబడ్డాడు. అతన్ని గ్రామస్తులు పోలీసులకు పట్టించారు. మొదట పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించిన యువకుడు, తర్వాత తన నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. పారిపోయిన తొమ్మిది మంది కోసం గాలిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కాక గుడుల మీద ఈ విధమైన దాడులు పెరుగుతున్నాయి. దాంతో హిందూ సమాజంలో భయం, నిరాశ పెరుగుతున్నాయి. కొన్ని నెలలుగా తరచుగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోకపోవడం తమ బాధను రెట్టింపు చేస్తోందని స్థానికులు వాపోతున్నారు.
హైదరాబాద్ పరిసరాల్లో ఇటువంటి దాడులు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. రక్షాపురంలో భూలక్ష్మి దేవాలయం, శివాజీనగర్‌లో మాతాజీ దేవాలయం, అంబర్‌పేటలో మరో మాతాజీ ఆలయంలో దేవతామూర్తులపై దాడులు జరిగాయి. తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇంకో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసారు. సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడి సంగతి తెలిసిందే. తాజాగా గత మంగళవారం నాడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర హనుమాన్ ఆలయంలో నవగ్రహ మూర్తులను ధ్వంసం చేసారు. ఇప్పుడు శనివారం నాడు ఈ గ్రామదేవతల విగ్రహాలను అవమానించారు.
సంఘటన జరిగిన వెంటనే స్థానిక హిందువులు స్పందించారు. విశ్వహిందూ పరిషత్, తదితర హిందూ సంస్థలు దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాయి. ఈ జుక్కల్ సంఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసాయి. అయినా, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనడం లేదు. ఈ కేసులో నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.