టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థ విశేషమైన నిర్ణయం తీసుకుంది. తమ విమానాల్లో ప్రయాణించే హిందూ, సిక్కు ప్రయాణికులకు హలాల్ చేసిన ఆహారం వడ్డించబోమని ప్రకటించింది. హలాల్ చేసిన ఆహారం కావాలనుకున్నవాళ్ళు ముస్లిం-మీల్ కావాలని ముందుగా బుక్ చేసుకోవచ్చు.
ఈ నిర్ణయం ఎయిర్ఇండియా మీల్స్ సర్వీస్‌లో కీలకమైన మార్పుగా నిలిచింది. ప్రయాణికుల్లో అన్ని మతాలవారూ ఉంటారు. అందరికీ హలాల్ చేసిన ఆహారం వడ్డించడం అంటే ముస్లిముల ఆహార పద్ధతులను మిగతావారిపై బలవంతంగా రుద్దడమే. ప్రత్యేకించి, ఆహారాన్ని హలాల్ చేసే పద్ధతిని పూర్తిగా వ్యతిరేకించే హిందూ సిక్కు మతస్తులకు వారికి తెలియకుండానే హలాల్ ఆహారాన్ని వడ్డించడం వారి విశ్వాసాలను కించపరచడం మాత్రమే కాదు, వారిని మోసం చేయడం కూడా.
ఇప్పుడు ఆ పద్ధతిని మారుస్తోంది ఎయిర్ ఇండియా. మాంసాహారులే అయినప్పటికీ హిందువులకు, సిక్కులకు హలాల్ చేయని ఆహారాన్ని, కోరినవారికి ముస్లిం మీల్నూ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి ముస్లిం దేశాలైన గల్ఫ్ దేశాలకు వెళ్ళే విమానాల్లో ఈ ఏర్పాటు అందుబాటులోకి తెచ్చింది.
‘‘కొత్త విధానం ప్రకారం హిందూ మీల్లో బీఫ్, పోర్క్ ఉండవు. సాధారణ మాంసాహారం హలాల్ చేయబడదు. హలాల్ చేసిన ఆహారమే కావాలి అనుకునేవారు ముందుగా ముస్లిం మీల్ ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. అలాంటి ఆహారానికి ఎంఒఎంఎల్ అనే ప్రత్యేకమైన స్టిక్కర్ వేసి ఉంటుంది. వాటికి మాత్రమే హలాల్ సర్టిఫికెట్ ఉంటుంది. సౌదీ అరేబియా వెళ్ళే అన్ని విమానాల్లోనూ హలాల్ చేసిన ఆహారమే ఉంటుంది. జెద్దా, దమామ్, రియాద్, మదీనా సెక్టార్లలో తిరిగే విమానాల్లోనూ, హజ్ ప్రత్యేక విమానాల్లోనూ హలాల్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంటుంది’’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది.