వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామసభలో సోమవారం అధికారులపై దాడి ఘటనలో 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీకి భూ సేకరణలో భాగంగా గ్రామసభ నిర్వహిస్తున్న సమయంలో స్థానికులు ఒక్కసారిగా తిరగబడ్డారు. వికారాబాద్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తృటిలో తప్పించుకున్నారు. కొడంగల్ అభివృద్ధి ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. డీఎస్పీ సహాయంతో అక్కడ నుంచి అధికారులు బయటపడ్డారు.
ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బాధ్యులైన 55 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులపై దాడి చేయడంతో తెలంగాణలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లాలో విధులు బహిష్కరించారు.
కొడంగల్, దుద్యాల, బోంరాస్‌పేట మండలాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సేకరణకు అధికారులు గ్రామసభలు నిర్వహించారు. అందులో భాగంగా దుద్యాల మండలం లగచర్లలో నిర్వహించిన గ్రామసభలో అధికారులపై స్థానికులు దాడికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది.