ఈశాన్యభారతరాష్ట్రం మణిపూర్‌లో జరిగిన పోరులో రాష్ట్ర పోలీసులు, భద్రతా బలగాలు కలిసి పదిమంది ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. ఆ సంఘటన నిన్న మధ్యాహ్నం జిరిబాం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… సోమవారం మధ్యాహ్నం సుమారు 3గంటల సమయంలో జకురాధోర్ అండ్ బొరొబెక్రా పోలీస్ స్టేషన్ చేరువలోని సిఆర్‌పిఎఫ్ పోస్ట్ మీద సాయుధులైన ఉగ్రవాదులు దాడి చేసారు. వారిని భద్రతా బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. సుమారు గంట పాటు జరిగిన కాల్పుల్లో పది మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణ ముగిసిన తర్వాత పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌లో ఆ పదిమంది మృతదేహాలూ లభ్యమయ్యాయి.
‘‘ఆ ఘర్షణ జరిగే క్రమంలో సంజీవ్‌కుమార్ అనే ఒక సిఆర్‌పిఎఫ్ జవానుకు బులెట్ గాయమైంది. అతన్ని వెంటనే అస్సాంలోని సిల్చార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది’’ అని పోలీసులు వెల్లడించారు. మృతుల దగ్గర పెద్దసంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు దొరికాయి. సంఘటనా స్థలంలో 3 ఎకెలు, 4ఎస్ఎల్ఆర్‌లు, 2ఇన్‌సాస్‌లు, 1 ఆర్‌పిజి, 1 పంప్ యాక్షన్ గన్, బిపి హెల్మెట్లు, బులెట్ మ్యాగజైన్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.