భారతదేశాన్ని అస్థిరపరచాలనే కుట్రతో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు బంగ్లాదేశీయులు భారత్లో నిర్వహిస్తున్న కార్యకలాపాల మీద జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం నాడు దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో సోదాలు నిర్వహించింది.
భారత్లో అల్ ఖైదా కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తూ అండగా నిలుస్తున్న కొందరు వ్యక్తులను ఎన్ఐఎ గుర్తించింది. వారికి సంబంధించిన తొమ్మిది ప్రదేశాల్లో నిన్న సోదాలు చేపట్టింది. జమ్మూకశ్మీర్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, బిహార్, త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లోని కొన్ని గుర్తించిన ప్రదేశాల్లో సోమవారం ఉదయం నుంచీ సోదాలు నిర్వహించామని ఎన్ఐఎ ఒక ప్రకటనలో పేర్కొంది.
‘‘ఈ కేసులో అనుమానితులు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న అల్ ఖైదా నెట్వర్క్ సానుభూతిపరులు. వారు అమలు చేసిన ఒక కుట్ర గురించి 2023లో నమోదైన కేసుకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించాము. భారతదేశంలోని అమాయకులు, మానసికంగా బలహీనులైన ముస్లిం యువతను ఆకర్షించి వారిని ఉగ్రవాదులుగా మలిచే కుట్ర అది’’ అని ఎన్ఐఎ ప్రకటన వివరించింది.