కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలు ఒకదాని తరవాత మరొకటి వెలుగు చూస్తున్నాయి. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో భూముల కేటాయింపులో అక్రమాల వ్యవహారంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి భార్యే లబ్ధిదారుగా ఉన్న సంగతి ఇటీవలే బైటపడింది. ఇంతలో రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే ఘనవ్యర్థాల నిర్వహణ పేరిట రూ.40వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు తలెత్తాయి. ఏకంగా 33మంది మంత్రులకు ఆ కుంభకోణంలో ప్రమేయముందని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ మేరకు రాష్ట్ర గవర్నర్, లోకాయుక్తలకు ఫిర్యాదు చేసింది.
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)లో ఘనవ్యర్థాల నిర్వహణ – సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ – కోసం రాష్ట్రప్రభుత్వం ఒక కాంట్రాక్టరుకు 25ఏళ్ళ కాంట్రాక్టు కట్టబెట్టింది. ఆ క్రమంలో అన్ని చట్టాలనూ, అన్ని నియమ నిబంధనలనూ ఉల్లంఘించారని ఆరోపిస్తూ… యాంటీ కరప్షన్ ఫోరమ్ అధ్యక్షుడు, బీజేపీ నేత ఎన్ఆర్ రమేష్ ఫిర్యాదు చేసారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రివర్గంలోని 33మంది మంత్రులు మోసం, అధికార దుర్వినియోగం, ప్రజానిధులను కాజేసే కుట్రలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 1570 పేజీలతో డాక్యుమెంట్ తయారు చేసి రాష్ట్ర గవర్నర్‌కు, లోకాయుక్తకూ ఫిర్యాదు చేసారు.
రమేష్ చేసిన ఫిర్యాదు ప్రకారం… బెంగళూరు మెట్రోపాలిటన్ కార్పొరేషన్లో ఘనవ్యర్థాల నిర్వహణ కాంట్రాక్టు రమ్మీ ఇన్సా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కట్టబెట్టారు. అన్ని నియమనిబంధనలనూ, చట్టాలనూ ఉల్లంఘించి ఏకంగా 25ఏళ్ళకు ఒకేసారి కాంట్రాక్టు ఇచ్చేసారు. తద్వారా రూ.40వేల కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. చట్టపరమైన విధివిధానాలను ఉల్లంఘించి, పారదర్శకంగా నిర్వహించాల్సిన బిడ్డింగ్‌ను బైపాస్ చేసి, కాంట్రాక్టును ఏకపక్షంగా ఒకే పక్షానికి కట్టబెట్టారు. దానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్యే బాధ్యత వహించాలి అని ఎన్ఆర్ రమేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రమ్మీ ఇన్సా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను గతంలో బ్లాక్‌లిస్ట్ చేసిన సంగతిని రమేష్ గుర్తు చేసారు. ఆయన చేసిన ఈ ఆరోపణ కర్ణాటక చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం మీద వెలుగు ప్రసరించింది. ఒక్క బెంగళూరు, మైసూరులో మాత్రమే కాదు, కర్ణాటక రాష్ట్రమంతటా కాంగ్రెస్ నాయకులు తమ శక్తికొద్దీ భూముల, ఆస్తుల విషయంలో కుంభకోణాలకు పాల్పడుతున్నారు. కొందరు నగలు ఎత్తుకుపోతే కొందరు ఏకంగా భూములనే ఆక్రమించేస్తున్నారు. ఇంకా, రాష్ట్రంలోని వారసత్వ సాంస్కృతిక సంపద నిర్వహణ పేరిట డబ్బులు పెద్దమొత్తంలో దోచుకుంటున్నారని రమేష్ ఆరోపించారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటే కాదు. రైతు పథకాలు, రైతురుణ మాఫీలు, ఫార్మా, వైద్య ఆరోగ్యం తదితర రంగాల్లో కుంభకోణాలకు పాల్పడుతోంది కాంగ్రెస్ సర్కారు. మందుల తయారీ కాంట్రాక్టర్లు అయితే దేశంలోనే అత్యుత్తమ ఔషధాల పేరిట నకిలీ మందులు తయారుచేసి అమ్మేస్తున్నారు.
రమేష్ నేతృత్వంలోని బీజేపీ బృందం కర్ణాటక గవర్నర్‌ను, లోకాయుక్తనూ కలిసి ఫిర్యాదు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన, జరుగుతున్న అన్ని కుంభకోణాల మీదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.