ఘోరం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తుఫాన్ కాలనీలోని ఓ చిన్నారిని కుక్కలు కొరికి చంపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఇవాళ ఉదయం తుపాన్ కాలనీకి చెందిన బాలతోటి గోపాలరావు, నాగమణిల ఏకైక సంతానం ప్రేమ్‌కుమార్‌పై కుక్కలు దాడి చేసి చంపాయి. ఏడాది వయసున్న ప్రేమ్‌కుమార్‌కు స్నానం చేయించేందుకు తల్లి నాగమణి రోడ్డుపైకి తీసుకువచ్చింది. అంతలో ఏదో పనుండి ఇంట్లోకి వెళ్లింది. అంతలోనే అటువైపుగా వచ్చిన కుక్కల గుంపు దాడి చేసి చిన్నారిని ఈడ్చుకెళ్లాయి. బయటకు వచ్చి చూసిన నాగమణి బిడ్డ కోసం వెతక్కా కుక్కలు ఈడ్చుకెళ్లడం గమనించి వెంటపడింది. స్థానికులు కూడా కర్రలతో కుక్కలను తరిమారు. తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్‌కుమార్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఈ దారుణ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత కొంతకాలంగా పెనుగంచిప్రోలులో కుక్కలు చెలరేగిపోతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.