ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఇవాళ జరగనున్న దీపోత్సవం కార్యక్రమానికి ముస్లిం ఎమ్మెల్యేలను ఆహ్వానించడం వివాదాస్పదమైంది. హైందవేతరులకు అనుమతి లేని హర్-కీ-పౌఢీ ప్రాంతంలో జరిగే దీపోత్సవానికి ముస్లిం ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందింది. జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా ముస్లిం ఎమ్మెల్యేలను ఆహ్వానించడాన్ని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ సంస్థలు నిరసించాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రం 25వ వార్షికోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుక జరుపుతున్నారు. అందులో భాగంగా హరిద్వార్‌లోని హర్-కీ-పౌఢీ వద్ద ఇవాళ సాయంత్రం దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో 3లక్షల దీపాలు వెలిగించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. హరిద్వార్ వాసులు కూడా తమ ఇళ్ళలో దీపాలు వెలిగించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. హర్-కీ-పౌఢీ వద్ద దీపోత్సవంతో పాటు భజనలు కూడా ఏర్పాటు చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీని కూడా ఆహ్వానించారు.
ఈ దీపోత్సవ కార్యక్రమానికి హరిద్వార్ జిల్లాలోని పిరన్ కలియార్ అసెంబ్లీ స్థానానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫర్కన్ అహ్మద్, లక్సర్ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే మొహమ్మద్ షాజాద్, మంగ్లౌర్ అసెంబ్లీ స్థానానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాజీ నిజాముద్దీన్లను జిల్లా అధికారులు ఆహ్వానించారు.
అయితే హర్-కీ-పౌఢీ దగ్గర గంగా ఆరతి సహా, హిందూ ధర్మానికి చెందిన పలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల అక్కడ హిందూయేతరులకు అనుమతి లేదు. ఆ విషయాన్ని అక్కడ ఆరతి కార్యక్రమాలు నిర్వహించే శ్రీ గంగా సభ గుర్తు చేసింది. సంప్రదాయాలను పక్కన పెట్టి ముస్లిం ఎమ్మెల్యేలను పిలవడం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
హిందువులకు మాత్రమే పరిమితమైన ప్రాంతంలో హిందువుల కార్యక్రమమైన దీపోత్సవానికి ముస్లిం ఎమ్మెల్యేలను పిలవడం చట్టాలను అవమానించడమేననీ, అలాంటి చర్యను సహించబోమనీ శ్రీ గంగా సభ ప్రకటించింది. హర్-కీ-పౌఢీ దగ్గర హిందూయేతరులపై ఆంక్షలు వందేళ్ళ కంటె ముందునుంచీ కొనసాగుతున్నాయనీ, ఆ విషయం జిల్లా అధికారులకు తెలియకపోవడం విచారకరమనీ శ్రీ గంగా సభ ఆవేదన వ్యక్తం చేసింది.
హరిద్వార్‌లో హర్-కీ-పౌఢీ సహా దాదాపు అన్ని గంగాతీర ఘట్టాలలోనూ హిందూయేతరులకు ప్రవేశం లేదన్న సంగతిని విశ్వహిందూ పరిషత్ కూడా గుర్తు చేసింది. బ్రిటిష్ వారి పాలనా కాలంలో వారితో మదన్మోహన్ మాలవీయ కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగా ఆ ఆంక్షలు వందయేళ్ళ క్రిందటి నుంచే అమలవుతున్నాయని వివరించింది. హరిద్వార్ మునిసిపల్ కార్పొరేషన్ బై-లాస్లో కూడా ఆ ఆంక్షలు పొందుపరిచారని వెల్లడించింది. గతంలో రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన ముస్లిం అజీజ్ ఖురేషీ, క్రైస్తవురాలు మార్గరెట్ ఆల్వా కూడా ఆ ఆంక్షలను గౌరవించి, హర్-కీ-పౌఢీ కాకుండా వేరే ప్రదేశాల్లో కార్యక్రమాలకు హాజరయ్యారని వివరించింది.
ఈ చరిత్ర అంతా వివరించిన తర్వాత హరిద్వార్ జిల్లా యంత్రాంగం, హిందూయేతర ఎమ్మెల్యేలకు ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంది.