కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 28మంది నాయకుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. నవంబర్ 20న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వారిని సస్పెండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు దక్కనివారు తిరుగుబాటు అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేసారు. మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులపై వారు రెబెల్ అభ్యర్ధులుగా ఎన్నికకు సిద్ధమయ్యారు. దాంతో ఎంవిఎ కూటమి పక్షమైన కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.
కూటమి అభ్యర్ధులకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న రెబెల్స్ మీద ఆరు సంవత్సరాలు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జి రమేష్ చెన్నితల ప్రకటించారు. మొదట 16మంది పేర్లను ప్రకటించిన కాంగ్రెస్, తర్వాత మరో ఏడుగురిని కూడా సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. ఈ ఉదయం మరో ఐదుగురిని సస్పెండ్ చేసింది.
మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, శివసేన(యుబిటి), ఎన్సిపి(శరద్ పవార్) పార్టీలు ఉన్నాయి. ముస్లిం మైనారిటీల మద్దతుతో రాష్ట్రంలో అధికారం సాధిస్తామని ఆ కూటమి ధీమాగా ఉంది. బీజేపీ, శివసేన (బాల్థాక్రే), ఎన్సిపి (అజిత్ పవార్) పార్టీల మహాయుతి కూటమితో ఎంవిఎ పోటీ పడుతోంది.
మహారాష్ట్ర శాసనసభలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 20న ఒకే విడతలో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.