జార్ఖండ్‌కు చెందిన గిరిజన మహిళను ఎవరైనా చొరబాటుదారులు వివాహం చేసుకుంటే, వాళ్లకు పట్టా భూములను ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సెరైకేలాలో జరిగిన జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడిన అమిత్ షా, బీజేపీ అధికారంలోకి వస్తే, చొరబాటుదారులకు భూమి బదలాయింపును నిలిపివేసే చట్టాన్ని రూపొందిస్తామని వాగ్దానం చేశారు.
గిరిజన మహిళను పెళ్లి చేసుకుంటే జరిగే భూ బదలాయింపు ప్రక్రియను అడ్డుకునేందుకు చట్టాన్ని తేస్తామని తెలిపారు. చొరబాటుదారుల్ని గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు వారి నుంచి భూమిని తిరిగి లాక్కుంటామన్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు ఇస్తున్నాయని ఇటీవల జార్ఖండ్ ప్రచారంలో ప్రధాని మోదీ కూడా ఆరోపించారు.