మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేటి ఉదయం వైస్ ఛాన్సలర్ ప్రభాశంకర్ శుక్లా బంగ్లాతోపాటు అతడి వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో శంకర్ శుక్లాకు స్వల్ప గాయాలయ్యాయి. వర్సిటీలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వీసీని పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
యూనివర్సిటీలో అధికార దుర్వినియోగంపై విద్యార్థులు కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్ ప్రభా శంకర్ శుక్లా, రిజిస్ట్రార్ ఓంకార్ సింగ్, డిప్యూటీ రిజిస్ట్రార్ అమిత్ గుప్తా రాజీనామా చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ గేట్లను మూసివేసి ఆందోళనకు దిగారు. విద్యార్థుల నిరసనకు ఎన్ఈహెచ్యూ టీచర్స్ అసోసియేషన్, మేఘాలయ ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ మద్దతిచ్చాయి. పాలనా యంత్రాగాన్నిపూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశాయి.
యూనివర్సిటీలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మేఘాలయ ప్రభుత్వం కేంద్రం సహాయాన్ని కోరింది. సీఎం కాన్రాడ్ సంగ్మా ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు. సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవతీసుకోవాలని కోరారు.