అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఉన్న ఝార్ఖండ్‌లో బంగ్లాదేశీ చొరబాటుదార్ల వల్ల మారిపోతున్న జనాభా ముఖచిత్రం సంచలనాత్మక అంశంగా నిలిచింది. లవ్‌జిహాద్, లాండ్ జిహాద్, అక్రమ చొరబాట్లు, బలవంతపు మతమార్పిడుల వార్తలు లేని రోజన్నదే రాష్ట్రంలో ఉండడం లేదు. ఈసారి అదే విషయాన్ని బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది.
గిరిజన జనాభా ఎక్కువ ఉండే ఝార్ఖండ్‌లో ఈ ఎన్నికల వేళ సాహిబ్‌గంజ్, దుమ్కా, పాకూర్ వంటి జిల్లాలపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు చెందిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, రైతులకు కనీస మద్దతు ధర పెంపుదల హామీలిచ్చింది. బీజేపీ ప్రచారం పూర్తిగా ఆదివాసీల ఉనికి మీదనే దృష్టి సారించింది. రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడుతున్నవారి వల్ల నిజమైన స్థానిక ప్రజలకు సమస్యలు తలెత్తుతున్నాయి. బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదార్లు స్థలాలను ఆక్రమించేసి సొంత స్థలాలుగా చూపుతూ స్థిరనివాసాలు ఏర్పరచుకుంటున్నారు. దానివల్ల ఆ ప్రాంతంలో సహజంగా ఉండే డెమొగ్రపీ మారిపోయింది. అయితే ఆ విషయాన్ని పాలక జేఎంఎం ఒప్పుకోవడం లేదు సరికదా, బీజేపీ అనవసర భయాలను రేకెత్తిస్తోందంటూ విమర్శిస్తోంది.
అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్రంలో ముస్లిముల ఆధిక్యం ఎక్కువగా ఉన్న సంథాల్ పరగణాలో హిందువుల స్థితిగతులు అధమాధమంగా తయారయ్యాయి. ఆ ప్రాంతంలో ఉన్న కేవలం 35 హిందూ కుటుంబాలు పలు సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి. తమ ఆచార వ్యవహారాలను అనుసరించడం, రక్షించుకోవడం చేసుకోలేక పోతున్నాయి. చుట్టూ 11వేల ముస్లిం కుటుంబాల మధ్యలో ఆ హిందూ కుటుంబాలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయినా, కొద్దిరోజుల క్రితం జరిగిన ఛఠ్ పూజను వారు జరుపుకున్నారు. ముస్లిముల ఒత్తిడులను తట్టుకుని మరీ పూజలు చేసుకున్నారు. మన్సింగా, రాజ్‌మహల్ వంటి గ్రామాల్లో హిందూ కుటుంబాలు దాదాపు కనుమరుగైపోయాయి. మసీదులు, మదరసాలు పుట్టగొడుగుల్లా వెలిసాయి.
ఇలాంటి అంశాల గురించే బీజేపీ నిరంతరాయంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ ప్రాంతంలో ఏకాకిగా మారిన హిందువులు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా మెజారిటీగా మారిన ముస్లిములు వీరిని కనీసం చేపల వేటకు కూడా వెళ్ళనీయరు. అలా వారి వృత్తి నుంచి వారిని బలవంతంగా దూరం చేసారు.
‘‘మేము ఎన్నో యేళ్ళుగా పన్నులు కడుతున్నాం. కానీ 2014 నుంచీ పరిస్థితులు మారిపోయాయి. ఆ మార్పులు సవాళ్ళను వెంటపెట్టుకుని వచ్చేసాయి. ఇప్పుడు మమ్మల్ని చేపల వేటకు రానీయడం లేదు’’ అని ధనీచౌదరి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేసారు.
అశోక్ చౌధురి అనే వ్యక్తి, ఛఠ్ పూజ జరుపుకోవడం గురించి ఇలా చెప్పారు. ‘‘పెళ్ళి సమయాల్లో కూడా సంగీతం వల్ల వివాదాలు చెలరేగుతున్నాయి. అజాన్ ఇచ్చినప్పుడో, నమాజ్ చదివేటప్పుడో, పెళ్ళివారి ఊరేగింపు (బారాత్) మౌనంగా ఉండిపోవాలి. అలా చేయకపోతే, మా శుభకార్యం లేదా పండుగ వేళ వాళ్ళు గొడవలు రేపుతారు, మాతో గొడవలు పడతారు’’ అని వివరించారు.
జనాభా మార్పిడి (డెమొగ్రాఫిక్ చేంజ్) గురించి అదే ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ చౌధురి ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘కొత్తగా వస్తున్న ఈ జనాభా మన దేశంలోని ముస్లిములు కారు. వారి సంఖ్య నెలనెలా పెరిగిపోతూనే ఉంది. వాళ్ళు త్వరలోనే బెంగాల్‌కు కూడా వ్యాపించేస్తారు’’ అని రాజ్‌కుమార్ అనే వ్యక్తి చెప్పారు.
హిందువుల కడగండ్లు:
క్షేత్రస్థాయిలో హిందువులు పడుతున్న కష్టాలకు అంతూపొంతూ లేదు. అక్కడ హిందువులను బావి నుంచి నీరు కూడా తీసుకోనీయడం లేదు. ఈ ఎన్నికల వేళ మీరు ఏం కోరుకుంటారు అని అడిగితే, మంచినీళ్ళ బావి కావాలని అడుగుతున్నారు. ‘‘మేం నాలుగు నెలల క్రితం స్థానిక మంత్రి హఫీజుల్ అన్సారీ దగ్గరకు వెళ్ళి, మాకొక బావి కావాలని కోరాము. ఆయన మా ముఖం మీదనే మాకు సాయం చేయనని చెప్పేసాడు. హిందువులకు ఏమీ రావు అని స్పష్టంగా చెప్పాడు. ముస్లిములకు అన్ని సౌకర్యాలూ లభిస్తాయి, హిందువలకు మాత్రం ఏమీ దక్కవు. మాకే కనుక బావి ఉంటే మేము కూరగాయలు పండించుకోగలం’’ అని ఒక పెద్దాయన చెప్పారు.
దుర్గమ్మకు నిమజ్జనం లేదు:
దసరా నవరాత్రుల తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయడం కోసం ప్రయత్నించారని ప్రదీప్ మోదీ అనే వ్యక్తి ఇల్లు తగులబెట్టడానికి ముస్లిములు ప్రయత్నించారు. ‘‘శరన్నవరాత్రుల తర్వాత దుర్గాదేవి ప్రతిమను నిమజ్జనం చేయడానికి బయల్దేరాము. కానీ మా ఊరేగింపును అడ్డుకున్నారు. ప్రతీ విభాగం పైనా పోలీసులు ఒత్తిడి తెచ్చారు. హిందువులకు సహాయ నిరాకరణ చేసారు. చివరికి నిమజ్జనం జరగలేదు’’ అని ఆయన వాపోయారు.
మంత్రి హఫీజుల్ అన్సారీ ఒత్తిడికి తలిగ్గిన స్థానిక అధికార యంత్రాంగం హిందువులను తమ పండుగలు చేసుకోనివ్వడం లేదని, ఎలాంటి కార్యక్రమాలూ చేసుకోనివ్వడం లేదనీ చెప్పారు. ‘‘హిందువులు మైనారిటీలుగా మారిన చోట్ల, వాళ్ళ అజాన్ సమయంలో మన డీజేను అనుమతించరు, ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో నుంచి మన ఊరేగింపులు వెళ్ళనివ్వరు’’ అని ఆవేదన చెందారు.
హిందూ మహిళలపై రాళ్ళు రువ్వారు:
ఈ యేడాది జూన్ నెలలో గోపీనాథ్‌పూర్‌లో ముస్లిములు హిందూ మహిళలపై రాళ్ళు రువ్వారు. ఒక పెద్దాయన ఆ సంఘటన గురించి చెప్పారు. ‘‘సుమారు పదివేల మంది ముస్లిములున్నారు. పోలీసులు వాళ్ళను నియంత్రించ లేకపోయారు. చివరికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపితే కానీ వాళ్ళు ఆగలేదు. ఆ రోజు పోలీసులే లేకుంటే మేము ఇవాళ ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు’’ అని చెప్పారు.
‘‘వాళ్ళు ఇప్పటికీ మామీద దాడులు చేస్తున్నారు. మా ఇళ్ళలోకి చొరబడుతున్నారు’’ అని ఒక మహిళ కళ్ళనీళ్ళ పర్యంతమైంది. ఝార్ఖండ్‌లో హిందువుల జనసంఖ్య తగ్గిపోయిన ప్రాంతాల్లో వారి ప్రాణాలకు ప్రమాదం పొంచివుంది. జనాభా పరంగా ముస్లిములు పైచేయి సాధించిన చోట్ల సాంస్కృతికపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అసలు ఈ ఎన్నికల్లో హిందువులు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితే కనిపించడం లేదు.