ఏపీ వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ క్యాబినెట్ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కాసేపట్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ ఉదయం వెలగపూడి సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు పార్థసారధి, కొండపల్లి శ్రీనివాస్, నారా లోకేశ్ వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడ నుంచి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
అసెంబ్లీ వార్షిక బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. అమరావతి రాజధానికి ప్రపంచబ్యాంకు రుణానికి సంబంధించిన కేటాయింపులు చేయనున్నారు. తల్లికివందనం పథకానికి భారీగా కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. నీటిపారుదల రంగానికి పెద్దపీట వేసే అవకాశముంది. మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి కేటాయింపులు చేయనున్నారు.