సిరీస్ సమం కావడంతో మూడో మ్యాచ్ పై పెరిగిన అంచనాలు
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఓడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సఫారీల జట్టు లక్ష్యాన్ని ఛేదించి భారత్ పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.దీంతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ 1-1తో సమం అయింది.
గాబేహా వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత టాపార్డర్ తీవ్రంగా నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 124 పరుగులు చేసింది. సంజూ శాంసన్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ (4)మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాటపట్టడం భారత స్కోర్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపింది.
మిడిలార్డర్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 20 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (27) ఫర్వాలేదనిపించగా, హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) రాణించడంతో స్కోరు 120కి చేరింది. రింకూ సింగ్ (9) కూడా నిరాశపరిచాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యన్సెన్, గెరాల్డ్ కోట్జీ, సిమిలేన్, ఐడెన్ మార్ క్రమ్, ఎన్ కబయోంజి పీటర్ ఒక్కో వికెట్ తీశారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సఫారీ జట్టు తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. భారత్ బౌలర్ వరుణ్ చక్రవర్తి తెలివిగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీయడంతో సఫారీ జట్టు ఓడటం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆఖర్లో భారత బౌలర్ల పట్టు సడలటంతో దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో ఏడు వికెట్లనష్టపోయి 128 పరుగులు చేసి విజయం సాధించింది.
హెండ్రిక్స్(24), మార్క్‌రమ్ (3), జాన్సెన్ (7), క్లాసెన్ (2), మిల్లర్ (0)లను అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తి భారత్ విజయంపై ఆశలు రేపాడు. వరుణ్ ధాటికి 66 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. సిమ్‌లేన్ (7)ను రవి బిష్ణోయ్ బౌల్డ్ చేయడంతో సఫారీ ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ, స్టబ్స్( 47*), కోయిట్జీ( 19) రాణించారు. చివరి ఓవర్లలో భారత బౌలింగ్ పేలవంగా ఉండటంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ 13న జరగనుంది.