వైద్య విభాగంలో కీలకమైన ఆవిష్కరణలు చేసిన దివంగత శాస్త్రవేత్త డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావుకు ఏపీ ఎన్డీయే ప్రభుత్వం సముచిత గౌరవకం కల్పించింది. ఏలూరు ప్రభుత్వ వైద్యకాలేజీకి యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏదైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు , వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ను ఆదేశించారు.
సీఎం చంద్రబాబు సూచనతో ఏలూరు ప్రభుత్వ వైద్యకాలేజీకి యాల్లా ప్రగడ సుబ్బారావు పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం ఆదేశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తాను చేసిన ప్రతిపాదన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు.
ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త డాక్టర్ యల్లాప్రగడ సబ్బారావు స్వస్థలం భీమవరం, ఆయన రాజమహేంద్రవరంలో చదువుకున్నారు. కొత్తగా ఏర్పడిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏదైనా ఒకదానికి యల్లాప్రగడ పేరుపెడితే సముచితంగా ఉంటుందని పవన్‌కళ్యాణ్ కోరారు.
‘తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయాటిక్ ‘అరియోమైసిన్’ కనుగొన్నది డా. యల్లాప్రగడ సుబ్బారావు గారు. బోద వ్యాధి (ఫైలేరియా)కి సంబంధించి హెట్రజాన్, క్షయ వ్యాధి కట్టడికి ‘ఐసోనికోటినిక్ ఆసిడ్ హైడ్రాజైడ్’ రూపొందించారు. క్యాన్సర్‌కి వాడే కిమోథెరపీ ఔషధాల్లో తొలి తరం డ్రగ్ ‘మెథోట్రెస్సెట్’ను మరో శాస్త్రవేత్తతో కలసి అభివృద్ధి చేశారు. భారతీయులందరికీ గర్వ కారణమైన శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సుబ్బారావు గారు’ అని పవన్‌కళ్యాణ్ గతంలో ట్వీట్ చేశారు.